CPI Ramakrishna sensational comments on CM Jagan: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ధన బలంతో గెలవాలని చూస్తున్నారని.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దుర్మార్గపు పాలనకు బుద్ధి చెప్పేందుకు సీపీఐ, తెలుగుదేశం, జనసేన పార్టీలు ఏకమైయ్యాయని అన్నారు. ఎమ్మిగనూరులో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డిలతో కలిసి ఆయన ఎమ్మెల్సీ అభ్యర్థుల తరుపున ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఎవ్వరూ.. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇంత దుర్మార్గంగా వ్యవహరించలేదని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు చీలకూడదని అధికార పక్షానికి బుద్ది చెప్పేందుకు సీపీఐ, తెలుగుదేశం, జనసేన పార్టీలు చేతులు కలిపాయన్నారు. గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని ఆయన మండిపడ్డారు. శాసన మండలిని రద్దు చేయాలని కోరుతూ.. కేంద్రానికి లేఖ పంపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీపీఐ, తెలుగుదేశం, జనసేన పార్టీలు ఓ అవగాహనకు వచ్చాయని.. జిల్లాలో ఉన్న నిరుద్యోగులు, టీచర్లు, న్యాయమూర్తులు టీడీపీ తరుపున పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఓటు వేయాలని సూచించారు.
మాజీ మంత్రి, టీడీపీ పోలీట్ బ్యూరో సభ్యులు కళా వెంకటరావు మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని ఆరోపించారు. రాజాం క్యాంప్ కార్యాలయంలో మీడియా మాట్లాడిన ఆయన వైసీపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై, నిరుద్యోగుల సమస్యలపై అవగాహన ఉన్న టీడీపీకి మద్దతుదారుడు.. వేపాడ చిరంజీవి రావుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి, గెలిపించాలని ఆయన కోరారు.