Pidakala Festival in Kurnool: కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పల గ్రామంలో శ్రీ భద్రకాళి దేవి, వీరభద్ర స్వామి ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. వీరభద్ర స్వామి ఉత్సవాల్లో భాగంగా.. ఉగాది తర్వాత ఈ గ్రామంలో పిడకల సమరం జరుగుతుంది. ఇవాళ జరిగే పిడకల సమరానికి గ్రామస్థులు సిద్ధమయ్యారు. ప్రతి ఏటా ఇక్కడ జరిగే పిడకల సమరం వెనుక ఇంట్రస్టింగ్ స్టోరీ ప్రచారంలో ఉంది.
త్రేతాయుగంలో భద్రకాళి దేవి, వీరభద్ర స్వామి ప్రేమికులని ఆలయ చరిత్ర చెబుతోంది. వారి మధ్య ప్రేమ వ్యవహారం కాస్త గొడవకు దారితీస్తుంది. పెళ్లి విషయంలో వీరభద్రస్వామి కొంత ఆలస్యం చేస్తారు. దీంతో ప్రేమించి పెళ్లి చేసుకోకుండా తమ భద్రకాళి దేవిని.. వీరభద్ర స్వామి మోసం చేశారని అమ్మ వారి భక్తులు నమ్మి.. వీరభద్ర స్వామిని పేడతో తయారు చేసిన పిడకలతో కొట్టి అవమానించాలని చూస్తారు. ఈ విషయం తెలుసుకొన్న వీరభద్ర స్వామి భక్తులు.. అమ్మవారు ఉండే ఆలయం వైపు వీరభద్ర స్వామిని వెళ్లవద్దని వేడుకొన్నారని స్థానికులు అంటున్నారు. స్వామి.. భక్తులు చెప్పిన మాటలు వినకుండా అమ్మవారి ఆలయం వైపు వెళ్లారని, అప్పుడు అమ్మవారి భక్తులు ముందుగా వేసుకున్న ప్రణాళికలో భాగంగా వీరభద్ర స్వామి వారిపై పిడకలతో దాడి చేశారని కథలుగా చెప్పుకుంటారు.
ఈ విషయం తెలుసుకున్న స్వామి వారి భక్తులు కూడా పిడకలతో అక్కడికి వెళ్లి.. అమ్మవారి భక్తులపై ఎదురుదాడికి దిగారని, అలా ఇరువర్గాలు పిడకల సమరం సాగించారని అంటుంటారు. వారి మధ్య జరుగుతున్న పిడకల సమరం విషయాన్ని విశ్వకర్మ (భద్రకాళి అమ్మ వారి తండ్రి) బ్రాహ్మదేవునికి చెప్పారని, బ్రహ్మ దేవుడు.. వీరభద్ర స్వామి తండ్రి శివుడు దృష్టికి ఈ విషయాన్ని తీసుకుని వెళ్లారని, అనంతరం బ్రహ్మ దేవుడు అక్కడికి చేరుకొని ఇరువర్గాలను శాంతింపజేశారని అంటుంటారు.
పిడకల సమరంలో దెబ్బలు తగిలినవారు భద్రకాళి అమ్మవారు, వీరభద్ర స్వామి వార్ల ఆలయాలకు వెళ్లి.. నమస్కారం చేసుకొని అక్కడ ఉన్న వీభూతిని ఇరువర్గాల భక్తులు రాసుకుని రావాలని బ్రహ్మ ఆదేశించాడని, ఆ తర్వాత ఒకే ఆలయంలో ఇద్దరు విగ్రహాలను ఏర్పాటు చేసి వారికి కల్యాణం జరిపిస్తామని బ్రహ్మ దేవుడు మాట ఇచ్చినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది.