కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఉప కేంద్రానికి విద్యుత్తును సరఫరా చేసే 132 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న తీగ జంపర్ తెగిపోయింది. ఈ సమయంలో మరమ్మత్తులు చేయాలంటే తప్పనిసరిగా విద్యుత్‌ను ఆపాల్సిందే. ఇలా చేయడం వలన విద్యుత్ సంస్థకు లక్షల రూపాయల నష్టం వస్తుంది. ఈ నష్ట నివారణకు ప్రత్యేక చర్యలను అధికారులు తీసుకున్నారు. ఇందులో భాగంగా నైపుణ్యం కలిగిన సిబ్బందితో ప్రత్యేక దుస్తులను ధరింపచేసి... నిచ్చెన ఉపయోగించి విద్యుత్ సరఫరాను ఆపు చేయకుండానే మరమ్మత్తులు చేపట్టారు. 36 అడుగుల ఎత్తులో ఉన్న విద్యుత్ తీగను పట్టుకొని జంపర్లను సరిచేశారు. ఇలా మరమ్మత్తులు చేస్తున్న సమయంలో విద్యుత్ సరఫరాను నిలిపివేయలేదు. విజయవంతంగా జంపర్‌కు మరమ్మత్తులు చేసి సమస్యను పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో హాట్ లైన్ సబ్ డివిజన్ అధికారి అనిల్ కుమార్ రెడ్డి, ఏఈలు హుస్సేన్ వల్లి, జగదీష్ పర్యవేక్షణలో లైన్ ఇన్స్పెక్టర్ వెంకటసుబ్బయ్య ప్రత్యేక దుస్తులు ధరించి నిచ్చెన ఎక్కి మరమ్మత్తులు చేశారు.
విద్యుత్ ఉండగానే సబ్‌స్టేషన్ తీగలకు మరమ్మత్తులు
సాధారణంగా గృహాలకు అందించే విద్యుత్ తీగల్లో 220 వోల్టుల కరెంటు ప్రవహిస్తుంది. ఆ తీగలను తాకితే ప్రాణాపాయం సంభవించే అవకాశాలు అధికంగా ఉంటాయి. అలాంటిది ఏకంగా 132 కేవీల విద్యుత్ ప్రవహించే తీగలకు సరఫరా ఆపకుండానే మరమ్మత్తులు చేయడమంటే... ఎంత సాహసోపేతమైన చర్య. అసాధ్యం కదూ... అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు ఆళ్లగడ్డలోని విద్యుత్ ఉపకేంద్రంలో ప్రత్యేక సిబ్బంది.
ఆళ్లగడ్డ సబ్‌స్టేషన్ తీగలకు మరమ్మతులు