తుంగభద్ర పుష్కరాలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇవాళ్టి నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకు... 12 రోజుల పాటు పుష్కరాలు జరగనున్నాయి. కర్నూలులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తుంగభద్ర పుష్కరాలను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంట 10 నిమిషాలకు సంకల్‌బాగ్ పుష్కర ఘాట్‌కు సీఎం చేరుకుంటారు. ఒంటి గంట 21 నిమిషాలకు బృహస్పతి మకరరాశిలో ప్రవేశించిన వెంటనే... పుష్కరాలను ప్రారంభించనున్నారు. ప్రత్యేక పూజలు, హోమం కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం... తిరుగు పయనమవుతారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు.
పుష్కరాల కోసం కర్నూలు, కోడుమూరు, మంత్రాలయం, ఎమ్మిగనూరు, నందికొట్కూరు నియోజకవర్గాల్లో 23 ఘాట్లు ఏర్పాటు చేశారు. రహదారులు, మౌలిక వసతులు కల్పించారు. రెండో దశ కరోనా వ్యాప్తి భయంతో... అధికారులు తగిన జాగ్రత్తలు చేపట్టారు. నదిలో స్నానాలను నిషేధించారు. పిండప్రదానాలు, పూజాది కార్యక్రమాలకు మాత్రమే అనుమతినిచ్చారు. 12 ఏళ్ల లోపు చిన్నారులు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు ప్రవేశం లేదని స్పష్టం చేశారు.