ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంత్రి జయరాం భూ కుంభకోణంపై ప్రజా పోరాటం: అఖిలపక్షం - మంత్రి జయరాం భూ కుంభకోణం న్యూస్

రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం భూ కుంభకోణానికి నిరసనగా రైతుల పక్షాన పోరాటం చేయాలని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు నిర్ణయించాయి. భవిష్యత్తు కార్యాచరణపై కర్నూలులో అఖిలపక్షం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించిన నాయకులు...రైతులకు వెన్నుదన్నుగా నిలిచి చివరి వరకు ఉద్యమాలు చేయాలని తీర్మానం చేశాయి.

మంత్రి జయరాం భూ కుంభకోణంపై ప్రజా పోరాటం
మంత్రి జయరాం భూ కుంభకోణంపై ప్రజా పోరాటం

By

Published : Oct 13, 2020, 9:36 PM IST

కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని ఆస్పరి, ఆలూరు మండలాల పరిధిలో ఇట్టెనా కంపెనీ పేరుతో మంత్రి జయరాం భూములు కొనుగోలు చేశారని రాజకీయ పక్షాల నేతలు విమర్శించారు. ఈ భూ కుంభకోణంపై కర్నూలు జిల్లాలో అఖిలపక్షం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఆస్పరి, పెద్దహోతూరు, చిన్నహోతూరు, మరకట్టు గ్రామాలకు చెందిన రైతుల నుంచి 450 ఎకరాల భూములను తక్కువ ధరలకు సేకరించారని నేతలు ఆరోపించారు. ఇప్పటికీ ఈ భూముల్లో పరిశ్రమ ఏర్పాటు చేయలేదన్నారు. ఈ భూముల వ్యవహారంలో తమకు న్యాయం చేయాలని ఎన్నికల సమయంలో రైతులు జయరాంను కోరగా...తనను గెలిపిస్తే భూములు ఇప్పిస్తానని మాట ఇచ్చారని గుర్తుచేశారు. మంత్రి పదవి వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. ఇట్టెనా కంపెనీ నుంచి భూములను తానే కొనుగోలు చేసి...,రైతులను బెదిరిస్తున్నారని పలు పార్టీల నేతలు ఆరోపించాయి.

2013 భూ సేకరణ చట్టం ప్రకారం...పరిశ్రమల కోసం సేకరించిన భూముల్లో కంపెనీలు పెట్టకపోతే ఆ భూములను తిరిగి రైతులకే ఇచ్చేయాలన్నారు. అలా ఇవ్వకుండా మంత్రి రైతుల భూములపై కన్నేశారని...నాయకులు మండిపడ్డారు. మంత్రిపై ప్రత్యక్షంగా పోరాటానికి దిగాలని నిర్ణయించినట్లు నేతలు స్పష్టం చేశారు. త్వరలోనే సీఎం, రెవెన్యూ మంత్రులను కలిసి వినతిపత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, ఎస్​యూసీఐ సహా ఇతర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details