SEEMA GARJANA : కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ.. చేపట్టిన సీమగర్జన కార్యక్రమంలో భాగంగా.. భారీ బహిరంగ సభను ఏర్పాటుచేస్తున్నారు. STBC కళాశాల మైదానంలో సభ ఏర్పాట్లను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పరిశీలించారు. రాయలసీమ జిల్లాల ప్రజలు, నాయకులు ఈ సభలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలందరూ కలిసి ఉండాలనే ఉద్దేశంతోనే.. సీఎం జగన్ వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.
సీమగర్జన పేరిట ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందంటూ.. విపక్షాల నాయకులు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు అమరావతే రాజధాని అని సుప్రీంకోర్టులో చెప్పి.. కర్నూలులో హైకోర్టు ఎలా ఏర్పాటుచేస్తారని నిలదీశారు. సభకు రానివారు రాయలసీమ ద్రోహులు అంటూ మంత్రి బుగ్గన చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేత, మాజీ ఎంపీ T.G.వెంకటేశ్ ఖండించారు. అసలు ద్రోహులు వైకాపా నాయకులేనని.. వామపక్షాల నేతలు విమర్శించారు..
సీమగర్జనను విజయవంతం చేయాలని.. వైసీపీ తోపాటు అధికార యంత్రాంగం విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఉమ్మడి కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల నుంచి ప్రజలను తరలించాలని వైకాపా అధిష్ఠానం.. శ్రేణులను ఆదేశించింది. ఆయా జిల్లాల నుంచి 770 పాఠశాల బస్సులను ఆధీనంలోకి తీసుకుంది. ఒక్కో మహిళా సంఘం నుంచి... ఇద్దరు నుంచి ఐదుగురిని తరలించేలా సంఘం లీడర్లకు ఆదేశాలందాయి. సభకు రాని సంఘాలకు వంద రూపాయలు జరిమానా ఉంటుందని సెల్‌ఫోన్‌లలో సందేశాలు పంపారు.