ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యం కోసం పొరుగు రాష్ట్రాలకు పయనం.. మత్తులో మృత్యువాత - కర్నూలు జిల్లాలో ప్రమాదాలు తాజా వార్తలు

కర్నూలు జిల్లాకు చెందిన పలువురు మద్యం కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లి ప్రాణాలు కోల్పోతున్నారు. అక్రమంగా మద్యం తరలించడమే గాక.. అక్కడ తాగి వస్తూ మత్తులో ప్రమాదాలకు గురవుతున్నారు. తమ కుటుంబాల్లో విషాదాన్ని మిగుల్చుతున్నారు. నిరంతరం తనిఖీలు చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో పరిస్థితి చేయి దాటుతోంది. జిల్లాలో జరిగే ఎక్కువ ప్రమాదాల్లో ఈ కేసులే ఎక్కువగా ఉండటం గమనార్హం.

alcoholics accidents at karnool district
alcoholics accidents at karnool district

By

Published : Dec 11, 2020, 3:46 PM IST

తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు కర్నూలు జిల్లాకు సరిహద్దులుగా ఉన్నాయి. ముఖ్యంగా కర్నూలు నగరానికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ఉంది. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన పలువురు మద్యం తాగేందుకు పొరుగు రాష్ట్రానికి వెళుతున్నారు. మరికొందరు అక్రమంగా మద్యం బాటిళ్లను తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో నిత్యం జరిగే రహదారి ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు.

రూ.కోట్లల్లో అక్రమ సరకు:

కర్నూలు జిల్లాలో ప్రతిరోజూ రూ.కోటి వరకు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ప్రతి నెలా సరాసరిన రూ.35 కోట్ల వరకు సరకు అమ్ముడుపోతోంది. మరోవైపు ఇతర రాష్ట్రాల నుంచి ప్రతిరోజూ రూ.20 లక్షల విలువైన మద్యం అక్రమంగా జిల్లాలోకి వస్తోంది. ప్రతి నెలా రూ.కోటికిపైగా అక్రమ మద్యం పట్టుబడుతోంది. పట్టుబడని సరకు విలువ సైతం భారీగా ఉంటుందని అంచనా. వీటి నివారణకు జిల్లా సరిహద్దుల్లో పెద్దఎత్తున చర్యలు చేపడుతున్నప్పటికీ పలు ప్రాంతాల్లో తనిఖీలు అంతంతమాత్రంగానే ఉండటంతో యథేచ్ఛగా సాగుతోంది.

ధరలు తక్కువని..:

జిల్లాకు చెందిన పలువురు వ్యక్తులు మద్యం కోసం ప్రాణాలను పణంగా పెడుతున్నారు. హానికరమైన మద్యాన్ని తాగడమేకాక వృథాగా నిధులను ఖర్చు చేస్తున్నారు. మన రాష్ట్రంలోని మద్యం ధరలకు.. సమీప కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని మద్యం ధరలకు వ్యత్యాసం ఉంది. మన రాష్ట్రంలో కంటే ఆ రెండు రాష్ట్రాల్లో మద్యం ధరలు తక్కువ. ఈ నేపథ్యంలో చాలామంది ఆయా ప్రాంతాలకు వెళుతున్నారు. గతంలో చాలామంది మద్యం బాటిళ్లను అక్రమంగా రవాణా చేసుకుని తాగేవారు. సెబ్‌ తనిఖీలు ఎక్కువవడంతో ఏకంగా ఆయా రాష్ట్రాలకు వెళ్లి తాగుతున్నారు.

డ్రంకన్‌ డ్రైవ్‌ లేకపోవటంతో..

మద్యం మత్తులో వాహనాలు నడిపే వారి వల్లే జిల్లాలో అధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటంతో పోలీసు శాఖ డ్రంకన్‌ డ్రైవ్‌ విధానాన్ని అమలు చేసింది. లాక్‌డౌన్‌కు ముందు జిల్లావ్యాప్తంగా పోలీసు అధికారులు ప్రతిరోజూ బ్రీత్‌ ఎనలైజర్‌తో తనిఖీ చేసి 30 ఎంఎల్‌ మించి తాగిన వాహనచోదకులను గుర్తించి మోటారు వాహన చట్టం 185 కింద కేసులు నమోదు చేసేవారు. వాహనాన్ని సీజ్‌ చేసి నిందితుడిని కోర్టులో హాజరుపరిచేవారు. పలువురికి జరిమానాతోపాటు రెండు నుంచి వారం రోజుల వరకు జైలుశిక్ష పడేది. ఫలితంగా గతంలో కేసులు తగ్గాయి. లాక్‌డౌన్‌ అమలులోకి వచ్చినప్పటి నుంచి పోలీసులు డ్రంకన్‌ డ్రైవ్‌ చేపట్టకపోవటంతో మద్యం మత్తులో వాహనాలు నడిపే వారి సంఖ్య బాగా పెరిగింది.

ఇదీ చదవండి:

ఆస్తులు అమ్మి నిధులు సమకూర్చుకోవాల్సిన పని ఉందా..? : హైకోర్టు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details