Agitation of tomato farmers in Pattikonda market: కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్లో నిర్వహించే టమోటా మార్కెట్లో గత వారం రోజులుగా టమోటా ధరలు పూర్తిగా పతనమయ్యాయి. కిలో టమోటా రూ.3 కూడా ధర పలకనందున.. కొనేవారు లేక రైతులు కష్టపడి మార్కెట్కు తరలించిన పంట ఉత్పత్తులను నేలపై పారబోసి ఒట్టి చేతులతో ఇళ్లకు వెళ్తున్నారు. గత వారం రోజులుగా ఈ ధరలు మరింత పడిపోవడంతో అన్నదాతలు కుదేలవుతున్నారు. రోజు మార్కెట్కు భారీగా సరుకు తరలివస్తుండడంతో.. కొనేవారు లేక రైతులు వాటిని చూడలేక.. తిరిగి వాటిని తీసుకెళ్లలేక పలువురు రైతులు.. ఇక్కడే పశువులకు పారబోసి వెళ్తున్నారు.
30 కిలోల బాక్స్ రూ.100 లోపే పలుకుతుండడంతో.. కోత కూలీలకు కూడా ఆ డబ్బులు సరిపోవడం లేదంటూ కర్షకులు కన్నీటి పర్యంతమవుతున్నారు. గురువారం సాయంత్రం టమోటా మార్కెట్లో మంగళ, బుధవారాల కంటే కొంతమేర ధరలు మెరుగవడంతో వ్యాపారులు 30 కిలోల బాక్సుకు రూ.110 నుంచి రూ.150 వరకు కొనుగోలు చేస్తున్నారు.