adhoni people facing water problem: కర్నూలు జిల్లా ఆదోని ప్రజల తాగునీటి సమస్య పరిష్కారానికి.. రక్షిత మంచినీటి పథకం నిర్మించేందుకు.. 2003-04లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం 48 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది. 3 వేల 110 మిలియన్ లీటర్ల నిల్వ సామర్థ్యంతో ట్యాంక్ నిర్మాణానికి భూమిని కూడా సేకరించింది. బసాపురం దగ్గర 250 ఎకరాల భూమి సేకరించగా.. 2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పనులు చేపట్టింది. ట్యాంక్‌లో రాతి పరుపు ఏర్పాటు చేయాలని.. నిపుణులు సూచించినా వ్యయం తగ్గుతుందని నాటి ఇంజినీర్లు సీసీ లైనింగ్ చేపట్టారు. ఫలితంగా ప్రస్తుతం సైడ్‌వాల్ సిమెంట్ కాంక్రీట్ లైనింగ్ స్లాబ్‌లు కుంగిపోయాయి. మట్టి వదులుగా మారి సీసీ స్లాబ్‌లు విరిగాయి. చెరువుకట్టకు మూడు వైపులా ఇదే పరిస్థితి.
కుంగిపోయిన స్లాబ్ మరమ్మతులకు కోటీ 50 లక్షల రూపాయలు కేటాయించారు. కడప జిల్లాకు చెందిన ఓ గుత్తేదారు ఆర్నెళ్లల్లో పూర్తి చేయాల్సిన పనులను రెండు నెలల్లో పూర్తి చేశారు. మూడు నెలలైనా గడవక ముందే మళ్లీ పగుళ్లు ఇచ్చాయి. ప్రస్తుతం 180 కోట్ల రూపాయలతో పనులు మళ్లీ మొదలయ్యాయి. ఈసారి పనులు ఎప్పుడు పూర్తవుతాయో? తమ దాహార్తి ఎప్పటికి తీరుతుందో అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. సంక్రాంతి కల్లా పనులు పూర్తి చేసి ఫిబ్రవరిలో నీటిని నింపుతామని అధికారులు చెప్పుకొస్తున్నారు.