కర్నూలు జిల్లా బనగానపల్లె గనులు భూగర్భ శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో నాపరాతి గనులు లీజు కోసం ఓ బాధితుడి నుంచి రూ. 60 వేలు లంచం తీసుకున్న సిబ్బందిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
కొలిమిగుండ్ల మండలం బెలూం గ్రామానికి చెందిన జయరాముడు అనే వ్యక్తి నుంచి ఒక ఎకరా కొత్తగా లీజు మంజూరు చేసేందుకు రూ. 30 వేలు, మరో 5 ఎకరాల లీజ్ రెన్యువల్ కోసం రూ. 30 వేలు తీసుకున్నారు. ఈ వ్యవహారంలో సూపరింటెండెంట్ హుస్సేన్, అటెండర్ శంకర్, కంప్యూటర్ ఆపరేటర్ ధనుంజయలను పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ శివ నారాయణ స్వామి వెల్లడించారు. అవినీతి అధికారులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.