కర్నూలు జిల్లాలోని డోన్ ప్రాంతంలో వర్షాలు తక్కువగా కురుస్తుంటాయి. చాలా గ్రామాల్లో తాగునీటికి సైతం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి. ఫలితంగా ఇక్కడి ప్రజలంతా.. గుంటూరు జిల్లాకు వలస వెళ్తుంటారు. అక్కడ కూలిపని చేసి.. సంపాదించిన డబ్బుతో.. కుటుంబాన్ని నెట్టుకొస్తారు. ఈ ఏడాది కురిసిన వర్షాలకు భూగర్భ జలాలు పెరగటం సహా.. డోన్ మండలంలోని అబ్బిరెడ్డిపల్లె చెరువు జలకళ సంతరించుకుంది. దీంతో 15 గ్రామాల ప్రజలకు తాగు, సాగు నీటికి ఇబ్బందులు తీరనున్నాయి.
ప్రస్తుతం 5 వేల ఎకరాల్లో పంట సాగైంది. అబ్బిరెడ్డిపల్లె చెరువు కింద ధర్మారం, డోన్, వెంకటాపురం, అబ్బిరెడ్డిపల్లె, ఎర్రగుండ్ల, మల్లెంపల్లి, గుమ్మకొండ, కర్లకుంట, జగదుర్తి, లక్ష్మింపల్లి తదితర గ్రామాల పొలాలు ఉన్నాయి. ఈ చెరువు కింద గ్రామాల ప్రజలు ఒకప్పుడు రెండు పంటలు పండించేవారు. కొంత కాలంగా ఇక్కడ తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడటంతో పక్క ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. పదేళ్ల తర్వాత.. ఈ చెరువు నిండటం రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఒక పంట వేశారు. రెండో పంటకు సైతం నీరు వస్తుందని.. ఆనందంతో ఉన్నారు.