ఎంతో విలువైన భూమిని తనకు తెలియకుండా ఎమ్మెల్యే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన కర్నూలు జిల్లా నంద్యాలలో బుధవారం చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నంద్యాల పట్టణం శ్రీనివాసనగర్‌కు చెందిన లక్ష్మీదేవి భర్త కొన్నేళ్ల కిందట మృతి చెందారు. ఆమె భర్త, అతని అన్న(లక్ష్మీదేవి బావ)కు కలిపి స్థానిక పురపాలక కార్యాలయం వెనుక భాగాన 1.29 ఎకరాల భూమి ఉంది. దానిని ఇద్దరూ పంచుకోలేదు. బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ఆయన కుమారుడు కాటసాని ఓబులరెడ్డి పేరు మీద ఈ నెల 5న 55 సెంట్ల భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ విషయం తమకు తెలియదని, తమ సంతకాలు లేకుండా ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని.. ఆ భూమిని పంచుకోవడానికి కోర్టును ఆశ్రయిస్తుండగా కాటసాని రామిరెడ్డి ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకుంటారని లక్ష్మీదేవి ప్రశ్నించారు. తనకు రావాల్సిన భూమిపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆస్తి లేకపోతే ఎలా బతకాలని ఇక చావే శరణ్యమని భావించి ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి నిద్ర మాత్రలు వేసుకున్నట్లు చెప్పారు. లక్ష్మీదేవి కుమార్తె భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. ‘మా నాన్న లేరు. నా భర్తతో విడాకుల కేసు నడుస్తోంది. భూమి కోసం ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ఓబులరెడ్డి, జయమ్మ ఆ కుటుంబ సభ్యులందరూ ఏడాదిగా బెదిరిస్తున్నారు’ అని తెలిపారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తమకు న్యాయం చేయాలని కోరారు. ‘న్యాయం జరగకపోతే అందరం కలిసి ఆత్మహత్య చేసుకుంటాం’ అని ఆమె స్పష్టం చేశారు.
నేను ఎవరినీ బెదిరించలేదు..