కర్నూలు జిల్లా డోన్ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో పనిచేస్తున్న అసిస్టెంట్ ట్రైనింగ్ అధికారి కోదండరామయ్యకు మూగజీవాలంటే ఎంతో మక్కువ. విద్యార్థులకు వృత్తివిద్యా శిక్షణ ఇస్తున్న రామయ్య... కళాశాలలో పలు రకాల జంతువులను పెంచుతున్నారు. తమిళనాడు రాష్ట్రం నుంచి కుందేళ్ళు, బాతులు, నీటి కోళ్లను తెప్పించారు. వాటికి తోడుగా నెమళ్లనూ జతచేశారు. ప్రస్తుతం ఇక్కడ 8 కుందేళ్లు, 4 బాతులు, 5 సిటీ కోళ్లు, 5 నెమళ్లు, 30 చిన్న కోడి పిల్లలు ఉన్నాయి. వీటి రాకతో కళాశాలలో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది.
జంతు ప్రేమికుడు.. ఆ ఉపాధ్యాయుడు! - కర్నూలులో జంతు ప్రేమికుడైన ఉపాధ్యాయుడు
ఆ అధ్యాపకుడికి జంతువులంటే ప్రేమ. అందుకే వాటిని కంటికి రెప్పలా సంరక్షిస్తున్నారు. కళాశాలలోని విద్యార్థులూ వాటిపై ప్రేమను చూపిస్తున్నారు. మూగ జీవాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
రోజూ మూగ జీవాలకు ఆహారం, నీరు అందించటం ఆయన దినచర్యలో భాగంగా మారింది. విద్యార్థులు వీటిని ప్రేమగా చూసుకుంటున్నారు. రామయ్య నోరులేని జీవాలను ఎంత ప్రేమగా చూసుకుంటారో అంతే ప్రేమగా సహా అధ్యాపకులు, పిల్లలపైనా శ్రద్ధ తీసుకుంటారు. కళాశాలకు ప్రహారీ గోడ లేనందువల్ల కొందరు దుండగులు లోపలికి వచ్చి కోళ్లు, బాతులను ఎత్తుకెళ్లారు. ప్రిన్సిపల్ సహకారంతో మూగ జీవాలకు ప్రత్యేకంగా షెడ్డును నిర్మిస్తున్నారు. జంతువులు, పక్షులను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చాటి చెబుతున్నారు.
ఇదీ చదవండి:కర్నూలుకు నీళ్లు ఇవ్వాలని కోరితే హై కోర్టును ఇస్తారా?: బైరెడ్డి