వైద్య విద్య ప్రవేశానికి నిర్వహించిన పరీక్షలో తనకు అన్యాయం జరిగిందని కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఓ విద్యార్థిని వాపోయింది. ఆన్లైన్లో ఓఎమ్మార్ షీట్‌ను పరిశీలించగా పలు సందేహాలు తలెత్తాయని రేనాటి వెంకట వినీల తెలిపింది. కర్నూలు జిల్లా నంద్యాలలో కుటుంబ సభ్యులతో కలిసి విద్యార్ధిని మీడియాకు తన అనుమానాలు వివరించింది. విద్యార్థిని గత నెల 16 న నీట్ పరీక్షను కర్నూలు సిస్టర్ స్టాన్సిలూస్ మెమోరియల్ ఇంగ్లీషు స్కూల్లో పరీక్ష రాసింది. తాను మెరిట్ విద్యార్థినిగా చెబుతూ.. ఫైనల్ కీ ప్రకారం నీట్ పరీక్షలో 557 మార్కులు రావాల్సి ఉందని స్పష్టం చేసింది.
అయినా.. 113 మార్కులు మాత్రమే వచ్చాయని.. అది అన్యాయమని విద్యార్థినితో పాటు ఆమె తల్లిదండ్రులు వాపోయారు. ఓఎమ్మార్ షీట్ తారుమారు అయి ఉండవచ్చునని అభిప్రాయపడ్డారు. ఒరిజినల్ ఓఎమ్మార్ చూపాలని డిమాండ్ చేశారు. ఆ రాత తనది కాదని.. సంఖ్య క్రింద రెండు నంబర్ల వృత్తాలను తప్పుగా దిద్ది ఉన్నాయని వినీల స్పష్టం చేసింది. తాను అలా చేయలేదని తెలిపింది. ఒకవేళ హాల్ టికెట్ నంబర్ కింద వృత్తాలు తప్పుగా దిద్దితే... తప్పు సరిచేసి వెంటనే మరో ఓఎమ్మార్ షీట్‌ను ఇవ్వాల్సిన ఇన్విజిలేటర్లు అలానే ఎలా సంతకం చేశారని ఆ విద్యార్థిని ప్రశ్నించింది. ఈ అంశంపై పలువురికి ఫిర్యాదు చేశానని.. హైకోర్టును ఆశ్రయిస్తానని విద్యార్థిని తండ్రి సుబ్బరాజు తెలిపారు.