Science Theme Park Shut Down In Kurnool : కర్నూలులోని సైన్స్ థీమ్ పార్క్‌ను ప్రజా ప్రతినిధులు ఎంత అట్టహాసంగా ప్రారంభించారో కానీ ఈ ముచ్చట మూడ్రోజులు కూడా లేకుండా పోయింది. మార్చి 31న ప్రారంభించినప్పటికీ ఇంతవరకు దీనిని వినియోగంలోకి తీసుకురాలేదు. కర్నూలు నగరంలోని 20వ వార్డు గఫూర్ నగర్‌లో కర్నూలు నగరపాలక సంస్థ కోటి 87 లక్షల రూపాయలు ఖర్చు చేసి సైన్స్ థీమ్ పార్కును అభివృద్ధి చేసింది.
సైన్స్.. చక్కటి వాతావరణం : శాస్త్ర విజ్ఞానానికి సంబంధించిన విషయాలు విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా దీనిని తీర్చి దిద్దారు. అందరినీ ఆకట్టుకునేలా గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, వివిధ అంశాలకు సంబంధించిన చిత్రాలు, నమూనాలు రూపొందించారు. వీటితో పాటు పచ్చదనం ఉట్టిపడేలా మొక్కలు కూడా పెంచారు. మేయర్ బీవై రామయ్య, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాం భూపాల్ రెడ్డి సహా పలువురు ప్రజా ప్రతినిధులు ఈ పార్కును ప్రారంభించి జాతికి అంకితం చేశారు.
నిన్న ప్రారంభించారు.. ఈరోజు మూసివేశారు : ఈరో సైన్స్ పార్క్ అందుబాటులోకి వచ్చిందని దిప పత్రికల్లో చూసిన కర్నూలు వాసులు ఎంతో సంబరపడ్డారు. కానీ పార్క్ ప్రారంభోత్సవం అయిన వెంటనే దానిని మూసివేశారు. పార్కులో విలువైన వస్తువులు ఉన్నందున వాటిని సంరక్షించడం కష్టమవుతుందని భావించి తాళం వేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఎంతో ఉత్సాహంగా పిల్లలను తీసుకుని పార్కుకు వెళ్లిన తల్లిదండ్రులకు నిరాశే ఎదురైంది. అందరికీ అందుబాటులో ఉండే ప్రదేశంలో పార్కును నిర్మించినప్పటికీ వినియోగానికి వీలు లేకుండా చేశారంటూ వాపోతున్నారు.
పార్కును వినియోగంలోకి తీసుకురండి : ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన సైన్స్ థీమ్ పార్క్‌ను త్వరలోనే వినియోగానికి తీసుకురావాలని కర్నూలు వాసులు కోరుతున్నారు.