కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కాల్వ గ్రామానికి చెందిన సుంకులమ్మకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె. చిన్న కుమారుడు అనారోగ్యంతో మృతిచెందాడు. ఆస్తి పంచివ్వలేదని పెద్దకుమారుడు, కుమార్తె సుంకులమ్మతో మాట్లాడటం కూడా మానేశారు. అందరూ ఉన్న అనాథలా మిగిలిన సుంకులమ్మ... పొరుగూరు బ్రాహ్మణపల్లిలో కూరగాయలు, పండ్లు అమ్ముకుంటూ పొట్ట పోసుకునేది. ఓ రోజు బస్సు దిగి వస్తూ కిందపడి కాలు విరిగింది. ఆ మార్గంలో వెళ్తున్న బాలరాజు ఆమెకు వైద్యం చేయించి కాలుకు కట్టు కట్టించారు.
వృద్ధురాలి కుటుంబీకులకు బాలరాజు ఫోన్ చేసి.... జరిగిన విషయం చెప్పాడు. వాళ్లెవరరూ స్పందించకపోగా ఇంకెప్పుడూ ఫోన్ చేయొద్దని తెగేసి చెప్పేశారు. ఏం చేయాలో పాలుపోని బాలరాజు ఇక సుంకులమ్మ సంరక్షణ బాధ్యతలు తీసుకున్నారు. బస్‌షెల్టర్‌లోనే ఆమె ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. సమయానికి భోజనం, మందులు అందిస్తూ.. అండగా ఉంటున్నారు.