Attempt To Murder: అల్లారు ముద్దుగా పెంచి, చేయిపట్టి నడిపించాల్సిన తండ్రి... మానవత్వం మరచి కన్న కుమారులను చిమ్మచీకట్లో వదిలేశాడు. మద్యం మత్తులో ఆయన చేసిన పనికి... అభం శుభం తెలియని చిన్నారులు రాత్రంతా చలికి వణుకుతూ అల్లాడిపోయారు. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన మేరకు... కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలో నివాసముంటున్న కృష్ణ, సుజాత దంపతులకు ఐదుగురు సంతానం. వారిలో ఒక కుమార్తె, నలుగురు కుమారులు. కృష్ణ మద్యానికి బానిసయ్యాడు. అనుమానంతో భార్యను నిత్యం వేధించేవాడు. సోమవారం రాత్రి ఆమెతో గొడవపడి దారుణంగా కొట్టాడు. మద్యం మత్తులో జోగుతూ భార్య, ఇద్దరు కుమారులు బంటు(3), మహేంద్ర(5)లను ఆటోలో ఎక్కించుకుని ఊరికి దూరంగా వెళ్లాడు. కొంతదూరం వెళ్లాక భార్యను దించేసి, ఆమెపై మరోసారి దాడిచేశాడు. ఆమెకు స్పృహ తప్పడంతో అక్కడే వదిలేసి వెళ్లాడు. కుమారులను 5కిలోమీటర్ల దూరంలోని ప్యాలకుర్తిలోని దిగువ కాల్వ గట్టు వద్ద వదిలేశాడు. చిమ్మచీకట్లో పిల్లలిద్దరూ భయంతో వణికిపోయారు. తెల్లవారుజామున పొలాలకు నీరుపెట్టేందుకు అటుగా వచ్చిన ప్యాలకుర్తి రైతు లక్ష్మీనారాయణ... పిల్లల ఆర్తనాదాలు విని, పోలీసులకు సమాచారం ఇచ్చారు. హైవే పోలీసులు వచ్చి, చిన్నారులను చేరదీశారు. పిల్లలు తమ తల్లి గురించి చెప్పగా పోలీసులు వెళ్లి రక్షించారు. మంగళవారం కృష్ణను స్టేషన్‌కు పిలిపించారు. భార్యాభర్తలకు కౌన్సెలింగ్ చేసి, చిన్నారులను అప్పగించారు. విషయం తెలిసి బాలల సంరక్షణ నిర్వాహకులు కూడా ఠాణాను సందర్శించి, చిన్నారులను చేరదీసేందుకు ముందుకొచ్చారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
భార్యపై అనుమానం, భర్త ఏం చేశాడంటే - Latest News of AP
Attempt To Murder మద్యం మత్తులో ఓ తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. భార్యతో గొడప పడటమే కాకుండా ఇద్దరు పిల్లలను కడతేర్చేందుకు యత్నించాడు. స్థానికుడు గమనించి పోలీసులకు సమాచారమివ్వడంతో ప్రాణాలు దక్కాయి. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే
మద్యం మత్తులో పిల్లలను చంపాలని చూసిన తండ్రి
Last Updated : Aug 24, 2022, 8:26 AM IST