9 years of Modi govt: జనసేన, తెలుగుదేశం కలిసే ఉన్నాయని.. పవన్‌కల్యాణ్‌తో పొత్తు విషయం ఎన్నికల ముందు పార్టీ నిర్ణయిస్తుందని.. మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ తెలిపారు. జనసేన చంద్రబాబు కలిసి ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయని టీజీ వెల్లడించారు. అయితే, బీజేపీతో పవన్ కల్యాణ్ కలిసి పోటీ చేసే అంశంపై బీజేపీ పార్టీ పెద్దలు త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం 20శాతం నిధులు ఖర్చు చేస్తే, కేంద్ర ప్రభుత్వం 80శాతం నిధులు కేటాయిస్తోందన్నారు. కేంద్ర పథకాలను పేరు మార్చి రాష్ట్ర ప్రభుత్వానివిగా ప్రచారం చేసుకుంటున్నారని టీజీ వెంకటేష్ ఆరోపించారు. కేంద్రాన్ని ఒప్పించి కర్నూల్లో క్యాన్సర్ హాస్పిటల్ మంజూరు చేయిస్తే.. కేంద్రం 90 కోట్లు మంజూరు చేసినా... రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రి పనులు ఇంకా పూర్తి చేయలేదని టీజీ విమర్శించారు. మోదీ తొమ్మిదేళ్ల పాలన పూర్తి చేసుకొని, బలమైనా ఆర్థిక శక్తిగా ఎదిగిందని, సహజ వనరులతోనే దేశాభివృద్ధి సాధ్యమైందని వివరించారు.
పంచ భూతాలతో అభివృద్ధి: ఈ తొమ్మిది సంవత్సరాల్లో నరేంద్ర మోదీ సారథ్యంలో దేశం అభివృద్ధి చెందుతోందని టీజీ వెల్లడించారు. మోదీ ఆధ్వర్యంలో దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ప్రజలు చూస్తున్నారని టీజీ వెంకటేష్ పేర్కొన్నారు. పంచ భూతాలను వాడుకొని ''భూమి, ఆకాశము, వాయువు, జలము, అగ్ని" ఇలా పంచభూతాలను వినియోగించుకుంటూ దేశం అభివృద్ధి చెందేందుకు మోదీ కృషి చేస్తున్నారని టీజీ వెంకటేష్ వెల్లడించారు.