కర్నూలు కొత్త బస్టాండ్ సమీపంలో... కె.ఎస్.కేర్ ఆసుపత్రిని జనవరిలో ప్రారంభించారు. అనుమతి కోసం జనవరి 23న ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నా అనుమతులు రాలేదు. కరోనా విజృంభిస్తుండటంతో.. కొవిడ్ రోగులకు అనధికారికంగా చికిత్సలు ప్రారంభించారు. ఇటీవల కొందరు రోగులు ఈ వైద్యశాలలో చేరారు. శుక్రవారం రాత్రి వరకు ఆక్సిజన్‌కు ఎలాంటి ఇబ్బందీ లేదు. ఆసుపత్రిలో ఆక్సిజన్ తక్కువగా ఉందని, రోగుల్ని ఇతర ఆసుపత్రులకు తీసుకెళ్లాలని ఆసుపత్రి యాజమాన్యం శనివారం ఉదయం ప్రకటించిందని కుటుంబసభ్యులు వాపోయారు. చేసేది లేక తమ వారిని హుటాహుటిన వేరే ఆసుపత్రులకు తీసుకెళ్లడం మొదలుపెట్టారు.
ఆ దృశ్యాలు వివిధ ఛానళ్లలో ప్రసారం కావడంతో పోలీసులు ఆసుపత్రికి వెళ్లి పరిశీలించారు. అప్పటికే ఆసుపత్రి లోపల ఐదు మృతదేహాలున్నట్లు వారు గుర్తించారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పెండేకల్లు గ్రామానికి చెందిన మద్దిలేటి(40), డోన్‌కు చెందిన విశ్రాంత కానిస్టేబుల్ అనంతయ్య(62), ఎమ్మిగనూరు మండలం నందవరానికి చెందిన అంపమ్మ(65), కడప జిల్లాకు చెందిన రఘునాథరెడ్డి(40), జహీరాబీ(52) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ప్రాణాలు కోల్పోయారు. వీరందరూ ఐసీయూలో ఉన్నవారే. ఇదే ఆసుపత్రిలో శుక్రవారం రాత్రి మరో నలుగురు చనిపోయినట్లు రోగుల బంధువులు చెబుతున్నారు.
అధికారులు ఏం చెబుతున్నారంటే..
ఐసీయూలో శనివారం నాలుగు మృతదేహాలే ఉన్నట్లు ఆసుపత్రిని తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి రామగిడ్డయ్య వెల్లడించారు. ఆసుపత్రి యాజమాన్యం సహా వైద్యులు, సిబ్బందితో మాట్లాడి రికార్డులను చూసి.. కొవిడ్ కేసులా, సాధారణ కేసులా, వ్యాధి తీవ్రత ఉన్న కేసులా అని పరిశీలించిన మీదటే అన్ని విషయాలు చెప్పగలమని ఆయన తెలిపారు. ఘటన జరిగిన వెంటనే డీఎంహెచ్‌వో ఆధ్వర్యంలో విచారణ కమిటీని కలెక్టర్ వీరపాండియన్ నియమించారు. అనంతరం ఎస్పీ ఫక్కీరప్పతో కలిసి కలెక్టర్ ఆసుపత్రిని పరిశీలించారు. రోగులు ఆక్సిజన్ కొరతతో చనిపోలేదని డీఎంహెచ్‌వో డాక్టర్ రామగిడ్డయ్య, ఔషధ నియంత్రణ పరిపాలనాధికారి చంద్రశేఖర్ ఇచ్చిన నివేదికలో తేల్చారన్నారు. రోగులు ఏ కారణాలతో చనిపోయారన్న విషయాన్ని విధులు నిర్వర్తించిన వైద్యుడు కేస్‌షీట్‌లో పొందుపరిచి ఉంటారు. ఆ వివరాలను అధికారులు వెల్లడించలేదు.
ఆసుపత్రి యాజమాన్యంపై క్రిమినల్ కేసు
ఎలాంటి అనుమతీ లేకుండా అనధికారికంగా కొవిడ్ బాధితులకు చికిత్స చేసిన కె.ఎస్.కేర్ ఆసుపత్రి యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స వివరాలపై నిపుణులైన వైద్య బృందం చేత విచారణ జరిపిస్తామన్నారు. కర్నూలు ఔషధ నియంత్రణ ఏడీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఆర్‌ఎస్ గ్యాస్ సంస్థ ఈ వైద్యశాలకు శుక్ర, శనివారాల్లో 137 మెడికల్ ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేసిందన్నారు. ఆక్సిజన్ కొరతతో రోగులు మృతి చెందారంటూ మీడియాలో వచ్చిన వార్తలు నిజం కావన్నారు. ఆక్సిజన్ కొరత ఉందని వదంతులు సృష్టిస్తే డిజాస్టర్ మేనేజ్‌మెంట్ చట్టం కింద చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ చిత్రంలో వీల్‌ఛైర్‌లో ఉన్న మహిళ కర్నూలు జిల్లా కోవెలకుంట్లకు చెందిన లక్ష్మీనరసమ్మ. శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆమెను కేఎస్ కేర్ ఆసుపత్రిలో చేర్చారు. ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరి ఆక్సిజన్ శాతం పడిపోయిందని రూ.30 వేలు తీసుకున్నారని ఆమె కుమారుడు తెలిపారు. ఐసీయూలో ఒక్కొక్కరుగా చనిపోతుండటంతో శనివారం ఆటోలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆక్సిజన్ లేదన్నారు.. అప్పటికే మృతి