తెలుగు రాష్ట్రాలకు జలవిద్యుత్‌లో కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టులో చోటుచేసుకున్న ప్రమాదం విషాదాంతమైంది. గురువారం రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 9 మంది మృతిచెందారు. మంటలు త్వరగానే ఆర్పినా.. దట్టమైన పొగ కారణంగా ఊపిరాడక చనిపోయారు. సహాయక సిబ్బంది.. వారి ప్రాణాలు కాపాడేందుకు తుదికంటూ ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. 21 మంది సొరంగమార్గం ద్వారా బయపడి ప్రాణాలు దక్కించుకున్నారు. సమచారం తెలియగానే ఘటనాస్థలికి చేరుకున్న తెలంగాణ విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, జెన్‌కో సీఎండీ ప్రభాకర్ దగ్గరుండి సహాయక చర్యలు పర్యవేక్షించారు..
తెలుగు రాష్ట్రాల విద్యుత్ అవసరాలు తీర్చడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న శ్రీశైలం ప్రాజెక్టులో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదం.. 9 మంది సిబ్బందిని కబళించింది. శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ విద్యుత్ కేంద్రం నాలుగో యూనిట్‌లో గరువారం రాత్రి పదిన్నర గంటలకు.. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్యానల్ బోర్డు నుంచి ఎగిసిపడుతున్న నిప్పురవ్వలను చూసి ఉద్యోగులు భయభ్రాంతులకు గురయ్యారు. మంటలు ఆర్పేందుకు శాయశక్తుల కృషి చేశారు. కానీ.. అవి కొంచెం కొంచెంగా వ్యాపించాయి. పొగలు మాత్రం దట్టగా అలముకున్నాయి. ఆ షిప్టులో 30మంది పనిచేస్తుండగా.. 21 మంది సొరంగ మార్గం ద్వారా బయటపడి ప్రాణాలు దక్కించుకున్నారు. దట్టంగా అలుముకున్న పొగల వల్ల 9 మంది ఊపిరాడక దుర్మరణం చెందారు.
చనిపోయినవారిలో డీఈ శ్రీనివాస్, ఏఈలు వెంకట్‌రావు, మోహన్‌కుమార్, ఉజ్మ ఫాతిమా, సుందర్, జూనియర్ ప్లాంట్ అటెండెంట్ కిరణ్, బ్యాటరీ కంపెనీ సిబ్బంది వినేశ్, మహేశ్, పీఏ రాంబాబుగా గుర్తించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు.. విగత జీవులుగా మారిన తమవారిని చూసి గుండెలవిసేలా ఏడ్చారు.