KURNOOL MURDERS: కర్నూలు జిల్లా కౌతాళం మండలంలో గురువారం జరిగిన జంట హత్యల కేసులో 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం ఆదోనిలో డీఎస్పీ వినోద్‌కుమార్‌తో కలిసి ఎస్పీ సుధీర్ కుమార్‌రెడ్డి ఆ వివరాలు వెల్లడించారు. కామవరంలో ఓ భూ వివాద విషయమై మాట్లాడేందుకు గురువారం అదే గ్రామానికి చెందిన శివప్ప, ఈరన్న అలియాస్ భాస్కర్‌లతోపాటు కొంతమంది వడ్డే మల్లికార్జున ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో మారణాయుధాలతో జరిగిన దాడిలో శివప్ప, ఈరన్న మృతిచెందారు. మరి కొంతమంది గాయపడ్డారు. సంచలనం సృష్టించిన ఈ కేసు దర్యాప్తునకు 12 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నిందితులైన వడ్డే మల్లికార్జున, వడ్డే గోపాల్, వడ్డే రాజు, వడ్డే ఈశ్వర్, వడ్డే చంద్ర, వడ్డే హనుమంతు, వీరికి సహకరించిన కౌతాళంకు చెందిన బాపురం రామకృష్ణ పరమహంస అలియాస్ చాకలి రామకృష్ణలను హైదరాబాద్‌లో, వడ్డే ఉలిగమ్మ, వడ్డే లక్ష్మి, వడ్డే జయమ్మ, వడ్డే ఈరమ్మ, వడ్డే లక్ష్మిలను ఎమ్మిగనూరు మండలం మాసుమానుదొడ్డి గ్రామంలో అరెస్టు చేశారు. హత్యలకు ప్రధాన కారణం భూ తగాదాలేనని, నిందితులపై హత్య, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితులను 24 గంటల్లో అరెస్టు చేసిన సీఐలు, ఎస్సైలను అభినందించారు.
అసలు ఏం జరిగిందంటే..
ర్నూలు జిల్లా కౌతాళం మండలం కామవరంకు చెందిన బోయ మునీంద్రయ్యకు 7 ఎకరాల పొలం ఉంది. అదే పొలానికి ఆనుకుని ఉన్న పోరంబోకు భూమిని వడ్డె మల్లికార్జున సాగు చేసుకుంటున్నారు. మునీంద్రయ్య...తన పోలాన్ని అమ్మకానికి పెట్టగా... దాన్ని కొనుగోలు చేసేందుకు మల్లికార్జున ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే కొంత నగదు చెల్లించి ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే పూర్తి నగదు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోకుండానే.... సాగు చేసేందుకు మల్లికార్జున కుటుంబం..ఆ భూమిలోకి వెళ్లింది. అందుకు మునీంద్రయ్య అభ్యంతరం తెలపడంతో ఇరువురి మధ్య పొలం వివాదం కోర్టుకు చేరింది. మునీంద్రయ్యకు అనుకూలంగా తీర్పు వచ్చినా మల్లికార్జున ఆ పొలాన్ని వీడలేదు. మునీంద్రయ్య... స్థానిక వైకాపా నాయకుడు మహేంద్రరెడ్డిని ఆశ్రయించారు. విషయం తెలుసుకున్న మల్లికార్జున...భాజపా నాయకులతో మీడియా సమావేశం పెట్టించారు. భూ కబ్జాదారుడు పేరుతో వైకాపా నాయకుడిపై సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పెట్టారు. అంతలోనే... వైకాపా నాయకుడిది తప్పులేదని సామాజిక మాధ్యమాల్లో వార్తలు హల్ చల్ చేశాయి. తనపై ఇలాంటి ప్రచారం ఎందుకు చేస్తున్నారో తెలుసుకుని రావాలంటూ వైకాపా నాయకుడు మహీంద్రారెడ్డి..కొంతమందిని మల్లికార్జున ఇంటికి పంపించారు.