పదేళ్ల పిల్లాడు... శక్తినంతా కూడదీసుకుంటున్నాడు.. వయసుకు మించిన బలంతో చక్రాల కుర్చీని ముందుకు నెడుతున్నాడు. ఆ వాహనంలో నడవలేని అమ్మ... ఆమె ఒడిలో చెల్లెమ్మ. ఎలాగైనా సరే... ఎంత కష్టమైనా సరే.. తన వారిని కలుసుకోవాలనే పట్టుదలతో అడుగులో అడుగు వేస్తూ సాగుతున్నాడు. బయల్దేరింది హైదరాబాద్ నుంచి. చేరాల్సింది బెంగళూరుకు. దూరం దాదాపు 570 కిలోమీటర్లు. రాత్రనక పగలనక.. ఎండనక వాననక... ఒకటి కాదు రెండు కాదు.. అప్పటికే జాతీయ రహదారిపై 250 కిలోమీటర్లు నడిచాడు. తల్లినీ, చెల్లినీ మోస్తున్న బండిని లాగాడు. అలా.. తెలంగాణలోని మహబూబ్‌నగర్.. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు దాటేశాడు. కర్నూలు జిల్లా వెల్దుర్తిలో కొందరు యువకులు.. ఆ బాలుడితో మాట్లాడాక కానీ ఆ బుడ్డోడు ఎంతటి సాహాసం చేస్తున్నాడన్నది బయటపడలేదు.
వారంతా.. ఎక్కడివారంటే..!
ఉత్తరప్రదేశ్‌కు చెందిన హసీనాకు ఐదుగురు పిల్లలు. భర్త మరణించారు. పిల్లలతో కలసి కూలిపనులు, భిక్షాటన చేస్తూ బతుకుతున్నారు. సంచార బృందంతో కలిసి కొన్ని నెలల క్రితం హైదరాబాద్ వచ్చారు. ముగ్గురు పిల్లలు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ బృందంతో కలిసి బెంగళూరులోని ఓ ఆశ్రమానికి వెళ్లారు. లాక్‌డౌన్ వల్ల కుమారుడు షారుఖ్, చిన్న కుమార్తె మున్నీతో పాటు హసీనా హైదరాబాద్‌లో ఉండిపోయారు. ఆమె కాలు సరిగా లేక నడవలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో.. విధి లేక.. షారుఖ్ సాహసానికి సిద్ధమయ్యాడు. తన తల్లిని, చెల్లిని చక్రాల కుర్చీపై కూర్చోబెట్టుకుని బెంగళూరు బయలుదేరాడు.