స్వచ్ఛంద సంస్థల్లో ఒక్కొక్కరి ఒక్కోదారి. కొందరు పేదల సేవలో పాలుపంచుకుంటే మరికొందరు సామాజికచైతన్యంలో భాగస్వామ్యులు అవుతారు. ఈ సేవల్లో విభిన్నత చూపుతున్నారు... కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన యూత్ ఫర్ సోషల్ సర్వీస్ (వైఎస్ఎస్) స్వచ్ఛంద సంస్థ. యువతను సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యులను చేసే ప్రయత్నం చేస్తుంది. సమాజ అభ్యున్నతికి తమ వంతు కృషి చేస్తుంది.
యువతలో నవోత్సాహం
గుడివాడకు చెందిన యోగేశ్వర్ రెడ్డి.. ఆరు నెలల క్రితం ఈ సంస్థను స్థాపించారు. శోధించు, సాధించు, ఆవిష్కరించు అనే నినాదాన్ని లక్ష్యంగా ఎంచుకున్నారు. విద్యార్థులను సభ్యులుగా ఎంచుకుని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ర్యాంకుల కోసం పోటీపడుతున్న నేటి యువత శారీరక, మానసిక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ నిర్లక్ష్యం వారి ఆరోగ్యంపై తీవ్రప్రభావం చూపుతుంది. ఈ అంశాలపై విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తున్నారు. క్రీడల నిర్వహణ, మానసిక దృఢత్వం పెంచేలా యోగా తరగతులు, ధ్యానం వంటి కార్యక్రమాలు ఏర్పాటుచేస్తున్నారు.