Bhogaraju Pattabhi Sitaramaiah : రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లోని ప్రభుత్వ స్థలాల్ని.. పార్టీ కార్యాలయాలకు తీసుకుంటున్న వైసీపీ నాయకులు.. మచిలీపట్నం నడిబొడ్డున సుమారు 60-65 కోట్ల రూపాయల విలువచేసే రెండెకరాల స్థలాల్ని లీజు పేరుతో హస్తగతం చేసుకున్నారు. ఆగమేఘాల మీద నగరపాలక సంస్థలో తీర్మానం చేయించి, శనివారం భూమిపూజ కూడా చేసేశారు. అంతేకాకుండా అక్కడ పట్టాభి జ్ఞాపకార్థం నిర్మించాలనుకుంటున్న.. ఆడిటోరియానికి స్థలం కేటాయింపుపై కార్పొరేషన్‌లో తీర్మానం చేయకుండా అడ్డుకుంటున్నారు. రాష్ట్రప్రభుత్వం, ముఖ్యమంత్రి చొరవ తీసుకుని స్థలం కేటాయించినా.. కార్పొరేషన్‌లో తీర్మానం చేయకుండా అడ్డుపడుతున్నారు. దేశానికి స్వాతంత్య్రం సముపార్జించిన, తెలుగుజాతి కీర్తిపతాకాన్ని వినువీధుల్లో ఎగరవేసిన మహానుభావులంటే వైసీపీ నాయకులకు ఎంత మాత్రం గౌరవం లేదనడానికి ఇదే నిదర్శనం. వైసీపీ కార్యాలయానికి స్థలం కేటాయించేలా చేయడంలోనూ, పట్టాభి జ్ఞాపకార్థం తలపెట్టిన ప్రాజెక్టు ముందుకు వెళ్లకుండా అడ్డుకోవడంలోనూ స్థానిక ఎమ్మెల్యే హస్తం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సహకారించాల్సింది పోయి అడ్డుపడుతున్నారు : ఆంధ్రాబ్యాంకును కేంద్రప్రభుత్వం మూడేళ్ల క్రితం యూనియన్ బ్యాంకులో విలీనం చేయడంతో.. ప్రతి ఆంధ్రుడి గుండె తల్లడిల్లింది. ఆంధ్రుల అస్తిత్వాన్ని చెరిపేస్తారా అంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. అప్పుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య పేరు చిరస్థాయిగా నిలిచేలా ఆయన జ్ఞాపకార్థం మచిలీపట్నంలో రూ.40 కోట్లతో ఆడిటోరియం నిర్మించేందుకు, బ్యాంకు ప్రాంతీయ కార్యాలయాన్ని అక్కడే ఏర్పాటుచేసేందుకు యూనియన్ బ్యాంకు ముందుకొచ్చింది. తమకు రెండు ఎకరాలు కేటాయించాలని జిల్లా కలెక్టరును బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ కోరారు. స్థానిక వైసీపీ ఎంపీ బాలశౌరి చొరవ తీసుకుని.. భోగరాజు జ్ఞాపకార్థం ఆడిటోరియంతో పాటు, లైబ్రరీ, మ్యూజియం, కన్వెన్షన్‌హాలు నిర్మాణానికి ఐదు ఎకరాలు కేటాయించాలని ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేశారు. దానిపై జిల్లా కలెక్టర్ సీసీఎల్‌ఏకు ఒక ప్రతిపాదన పంపారు.
నగరం నడిబొడ్డున ఈడేపల్లిలో 5.45 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉందని, దానిలో 3.45 ఎకరాల్ని కేటాయించవచ్చని సిఫారసు చేయగా.. చివరకు రెండు ఎకరాలే కేటాయిస్తూ 2022 ఏప్రిల్ 25న సీసీఎల్‌ఏ ఉత్తర్వులిచ్చారు. అదే నెలలో ఆ భూమిని యూనియన్ బ్యాంక్ సీజీఎంకి అప్పగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులిచ్చారు. దానిపై మచిలీపట్నం నగరపాలక సంస్థ పాలకమండలి సమావేశంలో తీర్మానం చేయాల్సి ఉంది. ఎజెండాలో ఆ అంశాన్ని చేర్చకుండా స్థానిక ఎమ్మెల్యే అడ్డుపడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడి గౌరవార్థం, ప్రజలందరికీ ఉపయోగపడేలా ఆయన జ్ఞాపకచిహ్నాన్ని నిర్మించేందుకు, రూ.40కోట్లు కేటాయించేందుకు ప్రభుత్వరంగ బ్యాంకు ముందుకొస్తే స్వాగతించి, సహకరించాల్సిందిపోయి అలా అడ్డుపడటాన్ని ఏమనుకోవాలి? విచక్షణ ఉన్నవారెవరైనా చేసే పనేనా అది? కార్పొరేషన్‌లో ఎందుకు తీర్మానం చేయడం లేదని ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలో కార్పొరేషన్ కమిషనర్ చంద్రయ్యను కొందరు నిలదీశారు. ఆ తర్వాత ఆయన 15 రోజులు సెలవుపెట్టి వెళ్లిపోయారు.