YSRCP Leaders Sankranthi Cock Fight 2024 :సంక్రాంతి పండుగ అంటే అందరి చూపూ కోడి పందేల వైపే! సంప్రదాయబద్ధంగా కోడిపందేలు నిర్వహించాలని బెట్టింగ్‌లు జరగకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించినా నిర్వాహకులు వాటిని బేఖాతరు చేశారు. పందేలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా అధికారపార్టీ నేతల అండదందలు ఉండటంతో పోలీసులు ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారు. దీంతో బరుల వద్ద భారీగా నగదు చేతులు మారింది. పలుచోట్ల చెలరేగిన ఘర్షణలు దాడులకు దారితీశాయి.
AP High Court Rules on Sankranti Kodi Pandalu :ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలో జూదం, గుండాట పోటీలు మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, ఎమ్మెల్సీ పిల్లి అనంత బాబు, స్థానిక వైఎస్సార్సీపీ నేతల ఆధ్వర్యంలో కోడి పందేలు, జూదం విచ్చల విడిగా సాగాయి. మూడో రోజున కోడి పందేలను వీక్షించేందుకు భారీగా ప్రేక్షకులు తరలిరావడం, పోలీసుల పర్యవేక్షణ లేకపోవడంతో పలుచోట్ల దాడుల ఘటనలు చోటు చేసుకున్నాయి.
కత్తులు దూసిన కోళ్లు చేతులు మారిన కోట్లు
కోడి పందేంలో ఘర్షణ : ఏలూరు జిల్లాలో కోడి పందేల బరుల వద్ద పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కామవరపుకోటలో పందెం విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ పరస్పరం భౌతిక దాడుల వరకు వెళ్లింది. రావికంపాడులో తెలంగాణకు చెందినజూదం నిర్వాహకులకు స్థానికులకు మధ్య తోపులాట జరిగింది. జూదం ఓడి ఓ వ్యక్తి వెళ్లిపోతున్నాడంటూ అతనిపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. రాఘవాపురంలో కోడికత్తి తగిలి ఓ వ్యక్తి కాలికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తికి చికిత్స చేయించిన నిర్వాహకులు విషయాన్ని గోప్యంగా ఉంచారు.