Vijayawada YCP Leader Boppana Join in TDP : వైఎస్సార్సీపీ విజయవాడ నగర పార్టీ అధ్యక్షుడు బొప్పన భవ కుమార్ ఉండవల్లిలోని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాసంలో జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను కలిశారు. బొప్పనతో పాటు కేశినేని చిన్ని, గద్దె రామ్మోహన్ లోకేశ్‌ను కలిశారు. భవకుమార్‌తో పాటు ఆయన అనుచరులు వైఎస్సార్సీపీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే వంగవీటి రాధా, కేశినేని చిన్ని, గద్దె రామ్మోహన్ తదితర నేతలతో బొప్పన భవకుమార్ చర్చలు జరిపారు. బుజ్జగించేందుకు దేవినేని అవినాష్, వైఎస్సార్సీపీ నేతలు రంగంలో దిగనప్పటికీ ఆ పార్టీలో తనకి అడుగడుగునా అవమానాలు ఎదురైనందున అక్కడ కొనసాగనని తేల్చి చెప్పేశారు. ఎలాంటి షరతులు లేకుండా తెలుగుదేశంలో భవకుమార్ చేరనున్నట్లు తెలిసింది. 2019లో విజయవాడ తూర్పు నుంచి వైసీపీ తరఫున గద్దె రామ్మోహన్‌పై భవ కుమార్ పోటీ చేశారు.
టీడీపీలోకి భారీగా వలసలు - పచ్చకండువా కప్పుకొన్న వైసీపీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు
పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారధితో కలిసి తాను కూడా ఈ నెల 21వ తేదీన తెలుగుదేశంలో చేరబోతున్నట్లు బొప్పన భవకుమార్ స్పష్టం చేశారు. పార్టీ కోసం పని చేసిన తనకు, జలీల్ ఖాన్, పార్థసారథి, సామినేని ఉదయ భానుకు గౌరవం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఒక్కొక్కరూ పార్టీ వీడుతూ వచ్చారనీ, ఉదయ భాను ఇంకా వీడలేదు అంతేనన్నారు. వైసీపీలో ఎవ్వరూ ఇమడలేని పరిస్థితి నెలకొందని బొప్పన వ్యాఖ్యానించారు. విజయవాడలో పెత్తనం మొత్తం ఒక్కడి చేతిలోకి పోయిందని ఆక్షేపించారు. ఎవ్వడి సొంత నిర్ణయాలు వాడివి తప్పితే వైసీపీలో నేతలెవ్వరికీ గౌరవం లేదని వాపోయారు.