ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కృష్ణా నదిలో తవ్వకో - తరలించుకో - తీనుకో - ఇదీ వైఎస్సార్సీపీ నేతల దోపిడీ తీరు - సహజ వనరుల దోపిడీ

YSRCP Leaders Illegal Sand Mining: ఇసుక రవాణాలో కాసులే కాసులు! మట్టి మాటున బంగారం! బూడిద ఎత్తితే కరెన్సీ కట్టలు! ఇదంతా వ్యాపారవేత్తల విజయగాథలు కాదు! వైఎస్సార్సీపీ నేతల అక్రమ దందా! నాలుగున్నరేళ్లుగా సహజ వనరుల్ని చెరబట్టారు! దొరికినకాడికి తవ్వుకున్నారు! వంతులు వేసుకున్నారు! వాటాలు పంచుకున్నారు! ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇసుక, మట్టి, బూడిద దందాతో అధికార పార్టీ నేతలు వేల కోట్లకు పడగలెత్తారు. కాసుల వేటలో అధికార పార్టీ నేతలే కొట్లాడుకునే పరిస్థితికి దందా వెళ్లింది.

YSRCP_Leaders_Illegal_Sand_Mining
YSRCP_Leaders_Illegal_Sand_Mining

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 6, 2024, 2:09 PM IST

కృష్ణా నదిలో తవ్వకో - తరలించుకో - తినుకో - వైఎస్సార్సీపీ నేతల దోపిడీ తీరు

YSRCP Leaders Illegal Sand Mining : ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైఎస్సార్సీపీ నేతలు సహజ వనరులను గుల్లచేసి కోట్లు పోగేసుకున్నారు. ప్రధానంగా ఇసుక నుంచి కోట్లు దండుకున్నారు. కృష్ణా నది, మున్నేరు వాగుల వెంటపోటీపడి తవ్వుకున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ఉచిత ఇసుక విధానాన్ని ఎత్తేసింది. అప్పట్నుంచే అక్రమాలకు తెరలేపారు. కృష్ణా నది నుంచి హైదరాబాద్‌కు ఇసుక లారీలు వరుస కట్టాయి. రోజుకు సగటున వంద లారీలు! ఒక్క దానిలో కనీసం 50 నుంచి 60 టన్నులు. హైదరాబాద్‌లో ఒక్క లారీ ఇసుక లక్ష! అదే లారీ ఇసుక ఏపీలో రేవు వద్ద టన్ను 475 రూపాయలు మాత్రమే. అంటే 50 టన్నుల లారీ 23900 రూపాయలే! అలా రోజుకు కోటి రూపాయల లెక్కవేసినా నెలకు 30 కోట్ల వ్యాపారం. ఖమ్మం వైపు మరో 100 లారీలు. అలా గత నాలుగేళ్లలో దాదాపు 1500 కోట్లు ఇసుక నుంచి పిండుకున్నారు. ఇందులో ప్రభుత్వానికి సీనరేజీగా వచ్చింది గోరంతైతే? అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లింది కొండంత.

కృష్ణా నదిలోనూ, మునేరులోనూ వైఎస్సార్సీపీ అధికారంలోకొచ్చిన మొదటి ఆర్నెళ్లు తవ్వకాలు ఆపేస్తున్నట్లు ప్రకటించారు. కానీ హైదరాబాద్‌కు మాత్రం ఆగలేదు. ఆ తర్వాత జేపీ సంస్థ ముసుగులో టర్న్‌కీ సంస్థకు తవ్వకాల బాధ్యత అప్పగించారు. పశ్చిమ కృష్ణాకు చెందిన ఓ MLA తన అనుచరులను పెట్టి తవ్వకాలు ప్రారంభించారు. ప్రభుత్వానికి సీనరేజీ సొమ్ము చెల్లించడంతో పాటు నెలకు 21 కోట్ల రూపాయలు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. అంటే ఏడాదికి 252 కోట్లు చెల్లించాల్సి ఉంది.

డ్రెడ్జింగ్‌ యంత్రాలతో జల వనరులను తోడేస్తున్న దోపిడీదారులు - వైసీపీ పెద్దల అండతోనే దోపిడీ

ఏడాదిన్నర పాటు ఇసుక తరలించే కాంట్రాక్టును అనధికారికంగా కొనసాగించిన ఆ MLA నెలకు 2 కోట్ల రూపాయల వరకు నిర్వహణ నష్టం వస్తోందంటూ వదులుకున్నారు. దానికి కారణం తన నియోజకవర్గంలోనే ఆధిపత్య కోసం ప్రయత్నిస్తున్న ఓ మంత్రి కూడా ఇసుక తవ్వకాలు జరిపి లారీలను హైదరాబాద్‌ తరలించడం! ఓ పెద్ద మనిషి తనయుడు, ఓ ఎమ్మెల్సీ, ఓ మంత్రి తనయుడు కూడా కృష్ణా నది ఇసుకపైనే దృష్టి పెట్టి హైదరాబాద్‌కు తరలించారు. దీంతో ఎమ్మెల్యే పంచాయితీని ముఖ్యనేత దృష్టికి తీసుకెళ్లి కాంట్రాక్టు వదులుకున్నారు.

తర్వాత ఇదే కాంట్రాక్టును ఓ ఎమ్మెల్యే అనుచరుడు కంచికచర్ల మండల వైఎస్సార్సీపీ నేతకు అప్పగించారు. నష్టం వస్తుందనే సాకు చూపి నెలకు 18 కోట్ల రూపాయలు చెల్లించేలా అప్పగించారు. ఆ నాయకుడికి సొంతంగా జేసీబీలు, టిప్పర్లు ఉండటంతో రేయింబవళ్లు లక్షల టన్నుల ఇసుక తవ్వి హైదరాబాద్‌ తరలించారు. ఇటీవల కాంట్రాక్టు మారేంత వరకూ ఆయనే తరలించారు. ఎమ్మెల్యేలకు వాటాలు చెల్లించారనే విమర్శలున్నాయి. వాస్తవానికి NGT నిలుపుదల చేయాలని ఆదేశాలు ఇచ్చినా కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ అనుమతులు లేకపోయినా కృష్ణా నదిలో తవ్వకాలు జరిపారు. రవాణా చేస్తున్నారు.

ప్రస్తుతం చెన్నైకి చెందిన ఓ కాంట్రాక్టరు కడప జిల్లాకు చెందిన నేత తరపున తవ్వకాలు జరుపుతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి హైదరాబాద్‌కు ఇసుకతరలించే వారిలో కీలక నేతలు ఉన్నారు. ఇక్కడి నుంచి తరలిస్తున్న ఇసుకకు తెలంగాణాలో అడపాదడపా ఓవర్‌ లోడ్‌తో జరిమానాలు వేస్తుంటారు. కానీ పట్టుకోరు. వే బిల్లులు చూడరు. గత రెండేళ్లుగా కృష్ణా నదిలో ప్రకాశం బ్యారేజీ దిగువన కాలుష్య నియంత్రణ మండలి ఒక్క రేవుకూ పర్యావరణ అనుమతులు ఇవ్వలేదు. ఎగువన 16 రేవులకు ఇచ్చినా గత మే నెలతోనే వాటి గడువు ముగిసింది. ఐనా తవ్వకాలు సాగుతున్నాయి. ఇదేంటని తెదేపా నేతలు ప్రశ్నిస్తే వారిపైనే అక్రమ కేసులు బనాయించారు.

ప్రభుత్వ ఆదాయం పెంచడం కోసమే మిత్రమా : ఇసుకే కాదు మట్టినీ బంగారంగా మార్చేసుకున్నారు. మట్టి మాఫియా దెబ్బకు ప్రభుత్వ భూముూలు, పోరంబోకు భూములు, అటవీ భూములు, పోలవరం కుడి కాలువ కట్టలు, కొండలు, గుట్టలే కరిగిపోయాయి. గన్నవరం, విజయవాడ గ్రామీణం, మైలవరం ప్రాంతాల్లో కొండలకు బోడిగుండు కొట్టేశారు ! చేపల చెరువుల పేరుతోనూ మట్టి తరలించారు. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఓ అధికారి గన్నవరం నియోజకవర్గంలో విచ్చలవిడిగా మేత పోరంబోకు స్థలాల్లో గ్రావెల్‌ తవ్వకాలకు అనుమతులు ఇచ్చారు. అదేమంటే ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని వాదించారు.

బడా కంపెనీకి అనుకూలంగా బీచ్‌ శాండ్‌ టెండర్‌ నిబంధనలు- దరఖాస్తు ధరే రూ.5 లక్షలు!

నాడు జిల్లాలో ఓ కీలక మంత్రి, ముగ్గురు ఎమ్మెల్యేలు గోరంత అనుమతులు అడ్డం పెట్టుకుని కొండలన్నీ మాయం చేశారు. గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి ఒత్తిడితో పోలవరం కుడికాలువ మట్టి తరలించేందుకు అనుమతులు ఇస్తే మొత్తం కాలువ గట్టును మాయం చేయడమే కాదు బఫర్‌ జోన్‌లోనూ తవ్వారు. కొండపల్లి అభయారణ్యంలో ఎమ్మెల్యే అనుచరులు దాదాపు 200 కోట్ల విలువైన మట్టి తవ్వకాలు జరిపితే విచారణ లేకుండా మసిపూసి మారేడు కాయ చేశారు. విజయవాడ గ్రామీణం కొత్తూరు తాడేపల్లిలో దాదాపు 500 కోట్ల విలువైన మట్టి తవ్వకాలు జరిగాయి. గుంటూరు జిల్లా ప్రజాప్రతినిధి తన అనుచరులతో తవ్వించారు. ఈ మట్టి మొత్తం 16వ నెంబరు జాతీయ రహదారి విస్తరణకు వాడారు. గుత్త సంస్థలకు ఈ ప్రజాప్రతినిధులు సరఫరా చేశారు. కృష్ణా జిల్లా ప్రజాప్రతినిధి తన అనుచరులతో తవ్వకాలు జరిపించారు.

ఆదేశాలను లెక్కచేయని వైనం : NTR జిల్లా కొత్తూరు తాడేపల్లి పరిధిలో ఎలాంటి అనుమతుల్లేకుండా దాదాపు 150 ఎకరాల్లో మట్టి తవ్వేశారు. ఇప్పటికీ తవ్వుతున్నారు. గనుల శాఖకు ఘనపు మీటరుకు 45 రూపాయల చొప్పున, జలవనరుల శాఖకు 90 రూపాయల చొప్పున సీనరేజీ చెల్లించాలి. ఆ ఊసేలేకుండా 25 టన్నుల మట్టిని 10 వేల రూపాయల చొప్పున నిర్మాణ సంస్థలకు విక్రయిస్తున్నారు. ఓ ఎమ్మెల్యే తన ఇలాకాలో ఎవరెవరో మట్టిదందా చేస్తున్నారని అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు.

గనుల శాఖ నామమాత్ర నోటీసులు ఇవ్వగా, జలవనరుల శాఖలో వ్యతిరేకించిన అధికారుల్ని బదిలీ చేసి, తాము చెప్పినట్లు తలాడించే ఇంజినీర్లను నియమించుకున్నారు. కృష్ణా జిల్లా గనుల శాఖ డీడీ మట్టి తవ్వకాలను పట్టించుకోకుండా దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయారు. అక్రమ మట్టి తవ్వకాలు ఆపాలని నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ ఆదేశాలిచ్చినా నియంత్రించిన పాపాన పోలేదు. ప్రస్తుతం జాతీయ రహదారి కంటే స్థిరాస్తి వెంచర్లకు మట్టి తరలుతోంది. మట్టి తవ్వకాలకు కొత్తూరు తాడేపల్లి, వెలగలేరులో ఎసైన్‌మెంట్‌ భూములు ఎకరా 30 లక్షలకు కొని తవ్వకాలు జరుపుతున్నారు. కొంతమంది రైతుల వద్ద ఎకరా 10 లక్షలకు లీజు తీసుకుంటున్నారు. దీనిలో పది మీటర్ల లోతు వరకు తవ్వేందుకు అవకాశం ఇస్తున్నారు. ఈ మట్టి దందా నేతలదే!

బూడిద కాంట్రాక్టులో ఆధిపత్య పోరు :అధికార పార్టీ అక్రమార్కులు బూడిదనూ వదల్లేదు. NTR జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉన్న VTPS నుంచి బొగ్గు మండించడం ద్వారా రోజూ కొన్ని వందల టన్నుల బూడిద వెలువడుతుంది. ఇందులోనూ పొడి బూడిదను సిమెంటు కంపెనీలకు విక్రయిస్తారు. నీటితో కలిపి చెరువులోకి పంపిన బూడిదను స్థానికులు ఉచితంగా తీసుకెళ్లవచ్చు. గత కొన్నేళ్లుగా ఇది జరుగుతోంది. కొందరు యువకులు ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్‌గా ఏర్పడి ఒక క్రమపద్థతిలో బూడిద రవాణా చేసేవారు. ఇటుక బట్టీలకు విక్రయించే వారు. 2019 తర్వాత పరిస్థితి మారిపోయింది. ఓ ప్రజాప్రతినిధి దీనిపై ఆధిపత్యం కోసం తన అనుచరులతో రవాణా చేయించారు. దీనికి పోటీగా మరో మంత్రి తన అనుచరుల లారీలను ఏర్పాటు చేసి బూడిద తరలించడం ప్రారంభించారు.

ప్రస్తుతం ఓ పెద్ద మంత్రి ఏకంగా 600 లారీలను తమ బినామీలతో పెట్టించి రెండు నిర్మాణ సంస్థలకు పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. గతంలో లారీ బూడిద 3 వేల రూపాయలకు అమ్మేవారు. ప్రస్తుతం 10 వేలు పలుకుతోంది. విజయవాడ బైపాస్‌ పేరుతోజాతీయ రహదారి విస్తరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. కృష్ణా నదిపై వంతెనతో పాటుభారీ పైవంతెనలు ఆరు, చిన్న వంతెనలు, అండర్‌పాస్‌లు కట్టాలి. వీటికి అప్రోచ్‌ రహదారి ఎత్తు పెంచేందుకు మట్టి, గ్రావెల్‌కు బదులుగా థర్మల్‌ స్టేషన్‌ల నుంచి వచ్చే బూడిద వాడొచ్చు.

ఈ కాంట్రాక్టు రాయలసీమకు చెందిన ఓ పెద్ద మంత్రి బినామీ తీసుకున్నారు. ఉచితంగా బూడిద తీసుకొచ్చిన గుత్తేదారు ఒక ట్రిప్పు సుమారు 10 వేల చొప్పున నిర్మాణ కంపెనీలకు విక్రయిస్తున్నారు. ఈ బూడిద కాంట్రాక్టులో ఓ MLA, ఓ మంత్రి మధ్య ఆధిపత్య పోరు కొనసాగేది. అది పార్టీ పెద్దల వరకూ వెళ్లినా ఆగలేదు. చివరికి ఆ పనిని ఇప్పుడు రాయలసీమ ప్రాంత మంత్రి సొంతం చేసుకున్నారు. పెద్దల మధ్య నలిగిపోతున్న చిన్న ట్రాన్సుపోర్టర్లు అధికారులను ఆశ్రయించినా కనికరించలేదు.

ఇసుక దోపిడీకి 'తెర ముందు తమ్ముడు - తెర వెనక అన్న': నక్కా ఆనంద్​బాబు

ABOUT THE AUTHOR

...view details