YSRCP Leaders Illegal Sand Mining: రోజురోజుకీ వైసీపీ నేతల అక్రమాలు మితిమీరిపోతున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇసుక, బుసకను తరలిస్తూ కోట్లు దండుకుంటున్నారు. ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలోని 'ముదిరాజ్ ఫీల్డ్ లేబర్ కో-ఆపరేటివ్ సొసైటీ' పరిధిలోని 110 ఎకరాల భూమిని సంబంధిత రైతులను బెదిరించి యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతున్నారు. క్వారీలోకి ఎవరైనా అడుగుపెట్టకూడదని బెదిరిస్తూ.. దౌర్జన్యాలకు పాల్పడుతున్నారంటూ రైతులు వాపోతున్నారు.
ఘంటసాల మండలం శ్రీకాకుళం సమీపంలోని కృష్ణానదిలో సర్వే నెంబరు 176 లోని 110 ఎకరాలను.. 65 ఏళ్ల క్రితం చల్లపల్లిరాజావారి నుంచి ముదిరాజ్ ఫీల్డ్ లేబర్ కో-ఆపరేటివ్ సొసైటీ సభ్యులు కొనుగోలు చేశారు. మూడేళ్ల క్రితం వరకు రైతులు ఈ భూముల్లో పంటల్ని సాగు చేస్తూ వచ్చారు. అప్పట్లో కృష్ణా నదికి భారీ స్థాయిలో వరదలు రావడంతో నీటి ప్రవాహానికి వందల ఎకరాల్లో పంట కొట్టుకుపోయింది. దీంతో అప్పటి నుంచి రైతులు ఆ భూమిల్లో సాగుని తగ్గించారు.
నాటి నుంచే వైసీపీ నాయకుల కన్ను ఆ భూములపై పడింది. దొరికిందే తడవుగా ఆ భూముల్లో అక్రమంగా ఇసుక, బుసక తవ్వకాలు చేపట్టారు. ఇప్పటికే 15 ఎకరాలకుపైగా విస్తీర్ణంలో 30 అడుగుల లోతున మట్టిని కొల్లగొట్టారు. న్యాయం చేయాలని రైతులు తహశీల్దార్‌ని ఆశ్రయించగా.. తవ్వకాలు నిలిపివేయాలని ఆదేశించారు. ఒకటి, రెండు రోజులు తవ్వకాలు నిలిపివేసిన అక్రమార్కులు.. తిరిగి యథేచ్ఛగా తవ్వకాలు ప్రారంభించారు. దీంతో రైతులు స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మూడు రోజుల్లో చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు కానీ.. ఎలాంటి చర్యలు తీసుకోలేదని రైతులు వాపోతున్నారు.