ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Pulikunta Pond చెరువుపై వారి కన్ను పడింది..! ఇంకేముంది.. స్థిరాస్తిగా మార్చేందుకు ఇలా స్కెచ్ వేశారు! - వైఎస్సార్సీపీ నేతల భూ ఆక్రమణలు

Pulikunta Pond Encroachment: అది ఒకప్పుడు సాగునీటి చెరువు. దాని కింద దాదాపు 150 ఎకరాల ఆయకట్టు ఉండేది. ఆ స్థలంపై ఇప్పుడు వైసీపీ నేతల కన్ను పడటంతో.. క్రమేపీ ఆయకట్టు మాయమై.. స్థిరాస్తిగా మారింది. చెరువు ఒట్టిపోయింది. గన్నవరం నియోజకవర్గం కేసరపల్లిలో అత్యంత విలువైన ప్రదేశంలో ఉన్న పులికుంట చెరువు కబ్జాపై కథనం.

Pulikunta Pond Encroachment
పులికుంట చెరువు ఆక్రమణలు

By

Published : Jul 9, 2023, 4:52 PM IST

Updated : Jul 9, 2023, 5:16 PM IST

Pulikunta Pond Encroachment: కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం కేసరపల్లిలో అత్యంత విలువైన ప్రదేశంలో ఉంది ఈ పులికుంట చెరువు. ఇది ఒకప్పుడు సాగునీటి చెరువు. దీనికింద దాదాపు 150 ఎకరాల ఆయకట్టు ఉండేది. కుంటపై ఆధారపడి 16 పేద కుటుంబాలు జీవించేవి. ఎన్నో ఏళ్ళుగా ఆ కుంటను వారే సాగు చేస్తున్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక వారిని ఖాళీ చేయించింది.

సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా దాన్ని జగనన్న కాలనీలుగా పంపిణీ చేయాలని భావించింది. రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో పంపిణీ తాత్కాలికంగా ఆగింది. కానీ 2020 నుంచి రైతులను ఆ భూమిని సాగు చేయకుండా పడావు పెట్టారు. అదే స్థలంపై ఇప్పుడు అధికార వైసీపీ నేతల కన్ను పడింది. కబ్జాకు పక్కా స్కెచ్‌ వేశారు. ఇప్పటికే రహదారి పేరుతో కొంత ఆక్రమించారు. మిగిలినదాన్ని మింగేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ పులికుంట చెరువు.. విస్తీర్ణం 10.10 ఎకరాలు. క్రమేణా చెరువు ఒట్టిపోవడంతో కేసరపల్లిలో భూమిలేని వ్యవసాయ కూలీలు.. తలాకొంత సేద్యం చేసుకుంటూ జీవించేవారు. రెవెన్యూ దస్త్రాల్లో అనుభవదారులుగా 16 మంది పేర్లు ఉండేవి. ఈ ప్రాంతానికి అతి చేరువలోనే మేథా టవర్‌ నిర్మించారు. ఓ వైపు జాతీయ రహదారి, మరోవైపు అంతర్జాతీయ విమానాశ్రయం కూడా చెంతనే ఉండటంతో ఇక్కడ స్థలాల ధరలు కోట్లకు చేరాయి.

దొరికిందే అదునుగా స్థిరాస్తి వ్యాపారులు గ్రావెల్‌తో రోడ్డు వేసేశారు. అంతే కాదు.. నాలుగేళ్ల వరకు రైతులు వరిసాగు చేసే ఈ భూముల్లో ఏకంగా ఒక డొంక రోడ్డు కూడా వేశారు. ప్రజాప్రతినిధి అనుచరుల వెంచర్లకు వెళ్లేందుకే ఈ దారి వేశారని స్థానికులు చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రైతులు కోర్టును ఆశ్రయించడంతో వారిపై అధికారులు కక్ష కట్టారు. కేసు విచారణలో ఉండగానే రైతుల్ని ఆ భూమిలోకి రానీయకుండా ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టారు.

దీంతో వ్యవసాయం మీదే ఆధారపడే అన్నదాతలు.. నాలుగేళ్లగా పంట సాగు చేయలేకపోవడంతో లక్షల్లో ఆహార ఉత్పత్తులు కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబాల జీవనం గగనమైందని వాపోయారు. ఓ వైపు రైతులకు, ప్రభుత్వానికి వివాదం నడుస్తుంటే.. మధ్యలో స్థిరాస్తి వ్యాపారులు రంగప్రవేశం చేశారు. ఓ ప్రజాప్రతినిధి సిఫార్సులతో ఆ ప్రాంతంలో విద్యుత్తు లైను కూడా వేయించారు. ఇప్పటికే రోడ్డు పేరుతో ఎకరం వరకు ఆక్రమించేశారు.

మరో 4 ఎకరాలను ఆక్రమించేందుకు యత్నిస్తున్నారు. అన్ని నీటి వనరుల తరహాలోనే దీనిని కూడా కుంచించుకుపోయిందని చెప్పి.. కబ్జా చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇంత రాద్ధాంతం జరుగుతున్నా.. పులికుంట చెరువు విస్తీర్ణంపై అధికారులు సర్వే చేయకపోవడం అనుమానాలు తలెత్తుతున్నాయి.

చెరువుపై పడిన వైసీపీ నేతల కన్ను.. కబ్జాకు పక్కా ప్రణాళిక..!
Last Updated : Jul 9, 2023, 5:16 PM IST

ABOUT THE AUTHOR

...view details