YSRCP leaders attack: చెరువులో మట్టి తవ్వకాలను నిలిపేసేందుకు వెళ్లిన రెవెన్యూ ఇన్‌స్పెక్టరు, పోలీసు కానిస్టేబుళ్లపై వైకాపా నాయకులు దాడి చేసిన సంఘటన కృష్ణా జిల్లా పమిడిముక్కలలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఆర్‌ఐ శ్రీనివాస్ పోలీసులకిచ్చిన ఫిర్యాదు మేరకు.. మేడూరు శివారు జువ్వలపాలెం చెరువులో మేడూరు సర్పంచి భర్త గొర్కిపూడి బుజ్జి ఆధ్వర్యంలో మట్టిని అనధికారికంగా తవ్వి తరలిస్తున్నారు.
సమాచారం అందుకున్న ఆర్‌ఐ శ్రీనివాస్, వీఆర్వోలు.. ఇద్దరు కానిస్టేబుళ్ల భద్రతతో చెరువు వద్దకు వెళ్లారు. వారిని బుజ్జి, పమిడిముక్కలవాసి మారపాక మహేష్ మరికొందరు చుట్టుముట్టి వాగ్వాదానికి దిగారు. దీన్ని వీడియో తీస్తున్న కానిస్టేబుల్ బాలకృష్ణను మారపాక మహేష్ నెట్టాడు. ఆయన కిందపడిపోగా మహేష్ కర్రతో తలపై కొట్టాడు. కానిస్టేబుల్‌కు తీవ్ర గాయమైంది. సమాచారం అందుకున్న ఎస్సై శ్రీనివాస్ సిబ్బందితో అక్కడికి చేరుకొని బాధితుడిని ఉయ్యూరు ఆసుపత్రికి తరలించారు. అక్కడున్న జేసీబీ, మరో ట్రాక్టరును సీజ్ చేసినట్లు ఆర్‌ఐ తెలిపారు. ఐదుగురిపై కేసు నమోదు చేశామని ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. బుజ్జి పరారీలో ఉన్నాడని, మిగిలిన నలుగురికి కోర్టు రిమాండు విధించిందని తెలిపారు.