YSRCP Govt Delay in Distribution of Compensation to Mallavalli Farmers: తెలుగుదేశం ప్రభుత్వం రైతుల పొట్ట కొట్టిందని, వైసీపీ అధికారంలోకి వస్తే న్యాయం జరిగేలా చూస్తానని.. 2018 ఏప్రిల్‌లో గన్నవరం పాదయాత్రలో కృష్ణా జిల్లా మల్లవల్లి రైతులకు జగన్ మాటిచ్చారు. జగన్ పాదయాత్ర ముగిసి ఆయన సీఎం అయ్యారు. తెలుగుదేశం గుర్తుపై గెలిచిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వైసీపీలో చేర్చుకున్నారు. నాలుగేళ్లు గడిచిపోయాయి. అయినా కమిటీల మీద కమిటీలతో కాలయాపన చేస్తూనే ఉన్నారు.
నిర్వాసితుల నుంచి ఆర్జీలు తీసుకుంటున్నారే కానీ.. పరిహారం ఇవ్వడం లేదు. రైతులకు పరిహారం ఇచ్చేందుకు 22.5 కోట్ల బడ్జెట్ లేదు కానీ.. అదే స్థలాన్ని వందల కోట్లకు పారిశ్రామికవేత్తలకు A.P.I.I.C విక్రయించిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ పరిహారం రాకపోవడంపై ఆందోళనకు సిద్ధమయ్యారు.
గన్నవరం నియోజకవర్గ పరిధిలోని మల్లవల్లి గ్రామం సర్వే నెంబరు-11లో 14వందల 60 ఎకరాలను 2016లో A.P.I.I.C తీసుకుంది. అక్కడ పారిశ్రామికవాడ ఏర్పాటు చేసింది. దస్త్రాల్లో ప్రభుత్వ భూమిగా ఉన్నా.. అప్పటికే ఆ భూముల్లో సన్న, చిన్నకారు రైతులు సేద్యం చేసుకుంటున్నారు. అందువల్ల ఎకరాకు ఏడున్నర లక్షల చొప్పున రైతులకు పరిహారం ఇవ్వాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 490 మంది రైతులు 716 ఎకరాలు సాగు చేస్తున్నట్లు నిర్ధారించి.. మొత్తం 53 కోట్ల 73 లక్షల పరిహారం చెల్లించాలని నిర్ణయించింది.
కొన్నిఫిర్యాదులు రావడంతో 615.6 ఎకరాలకు గాను 443 మందికి 46 కోట్ల 17 లక్షల పరిహారం ఇచ్చింది. 32 మందిని బినామీలుగా పేర్కొనగా, మరో 15 మంది బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించకపోవడంతో పరిహారం చెల్లించలేదు. ఇక గ్రామానికి చెందిన 12వందల 28 మంది వ్యవసాయ కూలీలకు 50 వేల చొప్పున 61 లక్షల40 వేలు అందించింది.
2019లో ప్రభుత్వం మారింది. నూజివీడు సబ్ కలెక్టర్ ఆధ్వర్యాన రెండుసార్లు, గుడివాడ ఆర్డీఓ నేతృత్వంలో ఒకసారి కమిటీలు వేసి పరిశీలన చేశారు. నిర్వాసితుల నుంచి ఆర్జీలు స్వీకరించారు. 257 మంది తమ వద్ద ఉన్న ఆధారాలతో దరఖాస్తులు సమర్పించారు. మల్లవల్లి రైతులకు న్యాయం చేస్తామని స్థానిక ఎమ్మెల్యేతో పాటు సీఎం జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హామీ ఇచ్చారు.
తహశీల్దారు నుంచి కలెక్టర్ వరకు పలుమార్లు ఆర్జీలు అందజేశారు. విసిగిపోయిన నిర్వాసితులు పలుమార్లు పారిశ్రామికవాడలో పనులను అడ్డగించి ఆందోళన చేశారు. ఆందోళన జరిగినప్పుడల్లా సీఎం కార్యాలయానికి ఎమ్మెల్యే వంశీ పరుగెత్తడం.. సీఎం హామీ ఇచ్చారు, రేపే చెల్లింపులని చెప్పడం ఆనవాయితీగా మారిందని రైతులు మండిపడుతున్నారు.
మల్లవల్లి పారిశ్రామికవాడలో రైతుల భూములతో వైసీపీ ప్రభుత్వం వ్యాపారం చేసింది. గత ప్రభుత్వం పారిశ్రామిక యూనిట్లు నెలకొల్పేందుకు ఎకరా పదహారున్నర లక్షలకు కేటాయించింది. అశోక్‌లేలాండ్, మోహన్ స్పిన్‌టెక్, ఫుడ్‌పార్కులో పలు యూనిట్లు ఏర్పాటు అయ్యాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎకరా ధర 89.5 లక్షలకు పెంచారు. ఆ మేరకు చెల్లింపులు చేయకుంటే పరిశ్రమలకు భూకేటాయింపులు రద్దు చేస్తామని నోటీసులు జారీ చేసింది. కొంతమంది అప్పటికే యూనిట్లు నిర్మించడంతో ఆమేరకు ధర చెల్లించారు. మిగిలిన వారు అంత ధర చెల్లించలేక రద్దుకు దరఖాస్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మల్లవల్లి పారిశ్రామిక వాడలో కొత్త యూనిట్లు ఏర్పాటు కాలేదు. పురోభివృద్ధి లేదు. నిర్వాసితుల ఆకలి కేకలు ఈ ప్రభుత్వానికి పట్టడం లేదు.
ఇటీవల బాధిత రైతులు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కలిసి వారి గోడును వెళ్లబోసుకున్నారు. వారి ఆందోళనకు జనసేనాని పూర్తి మద్దతు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ మల్లవల్లి పారిశ్రామికవాడను సందర్శించి.. రైతులతో ముఖాముఖి కార్యక్రమానికి జనసేన నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు.
మల్లవల్లి రైతుల వ్యథ.."ప్రభుత్వానికి పట్టదా?”