పేద మహిళలను ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన వైఎస్‌ఆర్ చేయూత పథకానికి దరఖాస్తులు వెల్లువెత్తాయి. గడువు ముగియటంతో.. ఇప్పటి వరకు అందిన 2.11 లక్షల దరఖాస్తులను అధికారులు పునఃపరిశీలన చేస్తున్నారు. 27వ తేదీ ప్రారంభమైన ఈ ప్రక్రియ 30వ తేదీతో పూర్తవుతుంది. అప్పటి నుంచి మరో 3 రోజులు సామాజిక తనిఖీలు నిర్వహించి తుది అర్హుల జాబితాను సిద్ధం చేయనున్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు వీటికి సంబంధించి జిల్లా కలెక్టర్ దగ్గర పరిపాలన అనుమతి పొంది.. జిల్లాకు కావాల్సిన బడ్జెట్‌పై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తారు. ఈ పథకం అమలుపై మహిళలు ఆశలు పెట్టుకున్నారు. వచ్చే నెలలో తొలివిడత నిధులను విడుదల చేసి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది.
కృష్ణా జిల్లాలో 45 - 60 ఏళ్లలోపు ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలను ఆర్థికంగా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్‌ఆర్ చేయూత కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది ఆగస్టు 12 నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. దీనిలో ఏడాదికి ఒక్కొక్కరికి రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75వేలు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు సాయం అందాలంటే.. కుల ధ్రువీకరణ పత్రం తప్పనిసరి అయ్యింది. అయితే ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న వారిలో చాలా మందికి కులధ్రువీకరణ పత్రాలు అందలేదు. వీరంతా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో ఒక్కో సచివాలయం నుంచి దాదాపు 100 నుంచి 150 వరకు పెండింగ్‌లో ఉన్నాయి.
* గ్రామీణ ప్రాంతంలో ఒక కుటుంబ ఆదాయం నెలకు రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12వేలు లోపు ఉండాలి. ఆధార్ పత్రంలో పేర్కొన్న వయసును ప్రామాణికంగా తీసుకుంటారు.