ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

YS Viveka Murder Case: వివేకా కేసులో మరో ట్విస్ట్.. సీబీఐపై ఉదయ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు - వివేకా కేసు వార్తలు

ys Viveka murder case
ys Viveka murder case

By

Published : Feb 15, 2022, 3:29 PM IST

Updated : Feb 15, 2022, 3:57 PM IST

15:25 February 15

కడప అదనపు ఎస్పీని కలిసిన వివేకా హత్య కేసు అనుమానితుడు

వివేకా హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీబీఐ తనని వేధిస్తుందంటూ కేసులో అనుమానితుడిగా ఉన్న ఉదయ్ కుమార్ రెడ్డి కడప అదనపు ఎస్పీని కలిశారు. ఈ మేరకు సీబీఐ అధికారులపై ఫిర్యాదు చేశారు. వివేకా హత్య కేసులో తనకు తెలిసిన విషయాలు చెప్పినా పట్టించుకోవట్లేదని.. వాళ్లు చెప్పినట్లు వినాలని వేధిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనని మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పెడుతున్నట్లు ప్రస్తావించారు.

సీబీఐ ఛార్జీషిట్.. వెలుగులోకి కీలక విషయాలు..

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాబాయ్‌, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డిని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి.. తన అనుచరుడైన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ద్వారా హత్య చేయించారన్న అనుమానం ఉందని సీబీఐ పేర్కొంది. ఆ కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది. కడప లోక్‌సభ నియోజకవర్గం టికెట్టు అవినాష్‌రెడ్డికి కాకుండా తనకు లేదా వైఎస్‌ షర్మిల, విజయమ్మల్లో ఎవరికైనా ఒకరికి రావాలని వివేకానందరెడ్డి ఆకాంక్షించారని, ఈ నేపథ్యంలోనే అవినాష్‌రెడ్డి ఆయన్ను హత్య చేయించి ఉంటారనే అనుమానం ఉందని వివరించింది. తమ దర్యాప్తులో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయని పేర్కొంది. హత్య వెనుక ఉన్న భారీ కుట్రను వెలికితీసే దిశగా దర్యాప్తు సాగిస్తున్నామని వెల్లడించింది. ఈ కేసులో నిందితులైన ఎర్ర గంగిరెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, యాదటి సునీల్‌ యాదవ్‌, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, షేక్‌ దస్తగిరిల ప్రమేయంపై పులివెందుల కోర్టులో సీబీఐ గతంలో దాఖలు చేసిన అభియోగపత్రాలు సోమవారం వెలుగు చూశాయి. ఇప్పటివరకూ దర్యాప్తులో గుర్తించిన అంశాలను సీబీఐ అందులో ప్రస్తావించింది.

ప్రధానాంశాలివీ...

వివేకాను చంపినట్లు అంగీకరిస్తే రూ.10 కోట్లువివేకానందరెడ్డి హత్య నేరాన్ని నీపై వేసుకుని, అతణ్ని నువ్వే చంపినట్లు అంగీకరిస్తే రూ.10 కోట్లు ఇస్తా.. అంటూ కె.గంగాధరరెడ్డి అనే వ్యక్తికి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ఆఫర్‌ చేశారు. నిందితుల్లో ఒకరైన దస్తగిరిని సీబీఐ అధికారులు విచారణ కోసం దిల్లీకి పిలిపించారని శివశంకర్‌రెడ్డికి తెలిసింది. సీబీఐకి తమ పేర్లు చెప్పకుండా ఉంటే జీవితం సెటిల్‌ చేస్తానంటూ ఆయన దస్తగిరికి హామీ ఇచ్చారు. దిల్లీలో దస్తగిరి కదలికలు కనిపెట్టేందుకు, సీబీఐ ఆయన్ను ఏం ప్రశ్నిస్తుందో తెలుసుకునేందుకు భరత్‌యాదవ్‌ను అక్కడికి పంపించారు. 2019 ఫిబ్రవరి 10నే వివేకా హత్యకు ప్రణాళిక సిద్ధమైంది. ఎర్ర గంగిరెడ్డి ఇంట్లో జరిగిన ఈ కుట్రలో దస్తగిరి, సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి భాగస్వాములయ్యారు.

ఎమ్మెల్సీగా పోటీకి అడ్డుతగిలారని..

వివేకా హత్యకు కుట్ర, హత్య తర్వాత ఆధారాల ధ్వంసంలో పాల్గొన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కడప జిల్లా వైకాపాలో కీలక నేత. 2017లో కడప స్థానిక సంస్థల నుంచి వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయాలని భావించారు. దీంతో ఆ స్థానంలో పోటీ చేసిన వివేకాకు మద్దతివ్వలేదు. ఓటమి పాలైన వివేకా.. శివశంకర్‌రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకు ముందు వివేకా వైకాపాలో చేరితే రాయలసీమలో తమ ప్రాబల్యానికి ఇబ్బందవుతుందని భావించిన శివశంకర్‌రెడ్డి.. ఆయన చేరికపైనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

హత్య ప్రణాళికలో అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి‘

వివేకాను హత్య చేస్తే శివశంకర్‌రెడ్డి రూ.40 కోట్లు ఇస్తారు. అందులో నీకు రూ.5 కోట్లు ఇస్తాం. ఈ హత్య చేస్తే నీ జీవితం సెటిల్‌ అయిపోతుంది. వైఎస్‌ అవినాష్‌రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, వైఎస్‌ మనోహర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి వంటి పెద్దలు ఈ హత్య ప్రణాళికలో ఉన్నారు’ అని ఎర్ర గంగిరెడ్డి దస్తగిరితో చెప్పారు. వివేకా మృతి వార్త వెలుగుచూసిన తర్వాత 2019 మార్చి 15న ఉదయం 6.25 గంటలకు కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి.. దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఇతర సన్నిహితులతో కలిసి ఘటనాస్థలానికి చేరుకున్నారు. వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, వైఎస్‌ ప్రతాప్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డికి కూడా అక్కడికి చేరారు. వివేకా మృతదేహం రక్తపు మడుగులో ఉన్నా.. ఆయన గుండెపోటుతో మరణించారంటూ అవినాష్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలు ప్రచారం మొదలుపెట్టారు. ఇదే మాటను శివశంకర్‌రెడ్డి.. సాక్షి టీవీకి తొలిసారి చెప్పారు. వివేకా కుమార్తె, అల్లుడు రాకుండానే ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రయత్నించారు.

వ్యక్తిగత కక్షలతో హత్య కుట్రలోకి..

గంగిరెడ్డి, షేక్‌ దస్తగిరి, సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డిలు వ్యక్తిగత కక్షలతోనే వివేకా హత్య కుట్రలో భాగస్వాములయ్యారు. 2017లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో నా ఓటమికి పని చేశావంటూ వివేకా తరచూ ఎర్రగంగిరెడ్డిని తిట్టేవారు. బెంగళూరులో ఓ భూవివాదాన్ని సెటిల్‌ చేసినందుకు వివేకా రూ.8 కోట్లు ఆశించారు. దానిలో తనకూ వాటా ఇవ్వాలని గంగిరెడ్డి అడిగినా వివేకా ఇవ్వలేదు. వివేకా ఆస్తులకు బినామీగా, ఆయన వెన్నంటే ఉన్నా పంచాయతీ ఎన్నికల్లో తమ కుటుంబానికి అవకాశమివ్వలేదని గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, డ్రైవర్‌గా తీసేశారని షేక్‌ దస్తగిరి ఆయనపై కక్ష పెంచుకున్నారు.

సీబీఐ దాఖలు చేసిన ఛార్జీషిట్ తాజాగా వెలుగులోకి రావటంతో అనేక అంశాలు చర్చనీయాంశమయ్యాయి. ఇదే క్రమంలో సీబీఐ అధికారులు వేధిస్తున్నారంటూ కేసులో అనుమానితుడిగా ఉన్న ఉదయ్ కుమార్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడం ఆసక్తిని రేపుతోంది.

ఇదీ చదవండి

Gautam Sawang Transfer: గౌతమ్ సవాంగ్‌ బదిలీ.. కొత్త డీజీపీగా రాజేంద్రనాథ్‌రెడ్డి

Last Updated : Feb 15, 2022, 3:57 PM IST

ABOUT THE AUTHOR

...view details