YS Sharmila Counter to Kadiyam Srihari: తనపై కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలకు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కౌంటర్ ఇచ్చారు. ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని పదవులు అనుభవించిన ద్రోహి కడియం అని మండిపడ్డారు. 14 ఏళ్లు మంత్రిగా ఉండి నియోజకవర్గానికి.. ఒక్క డిగ్రీ కాలేజీ తీసుకురాలేదని ఆరోపించారు. జనగాంలోని కొన్ని మండలాల్లో ఇంటర్ కాలేజీలు కూడా లేవని విమర్శించారు. జనగాంకి పరిశ్రమలు వస్తాయి అన్నారు.. ఒక్కటీ కూడా రాలేదని దుయ్యబ్టటారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్లో ఏర్పాటు చేసిన సభలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో ఇద్దరు నాయకులుండి ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. గజ్వేల్ ఎలా ఉంది..? స్టేషన్ ఘన్ పూర్ ఎలా ఉంది..? అని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన రాజకీయ నాయకుడని షర్మిల ధ్వజమెత్తారు.
ప్రజాప్రస్థాన యాత్రలో భాగంగా వైఎస్ షర్మిల జనగామ జిల్లాలో పర్యటిస్తున్నారు. స్టేషన్ ఘన్‌పూర్ పరిధిలో ఆమె పాదయాత్ర కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఓ వైపు షర్మిల రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు.