ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సేవలకు సరికొత్త నిర్వచనం.. వరంగల్​ యువ బృందం - వరంగల్ రెడ్​క్రాస్​

ఆకలితో అలమటిస్తున్న వారి కడుపు నింపేందుకు ఆస్తిపాస్తులతో పనిలేదు.. ఆదుకునే మనసు ఉంటే చాలు. సాటి వారికి సాయం చేయాలంటే సంపద అవసరం లేదు.. అండగా నిలవాలనే తపనుండాలి. ఇదే విషయం తమ సేవా కార్యక్రమాలతో నిరూపిస్తున్నారు.. తెలంగాణ ఓరుగల్లుకు చెందిన యువత. కరోనా వల్ల వచ్చిన విరామ సమయాన్ని స్వదినియోగం చేసుకుంటూ సమాజ సేవలో భాగమవుతున్నారు. ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయిన అభాగ్యులకు అండగా నిలుస్తున్నారు.

red cross services
వరంగల్​ యువ బృందం

By

Published : Sep 12, 2020, 9:01 AM IST

Updated : Sep 12, 2020, 9:45 AM IST

నిస్వార్థంగా సాయం చేయాలనుకుంటే మార్గాలు అనేకం. ఈ ఆలోచనే పట్టుమని 20 ఏళ్లు కూడా లేని.. వారందరిని ఏకం చేసింది. తెలంగాణ ఓరుగల్లు కేంద్రంగా సేవాకార్యక్రమాలకు శ్రీకారం చుట్టేలా స్ఫూర్తినిచ్చింది. ఇటీవల ముంపునకు గురైన వరద ప్రాంతాల్లో పర్యటించి.. బాధితులకు సాయం అందించేలా చేసింది. అన్నార్థులకు, నిరుపేదలకు, అనారోగ్యం బారినపడిన వారికి అండగా నిలిచి యూత్ రెడ్ క్రాస్ సేవలకు సరికొత్త నిర్వచనం ఇచ్చారు ఈ యువబృందం.

సేవలకు సరికొత్త నిర్వచనం.. ఈ తెలంగాణ వరంగల్​ యువ బృందం

యూత్ రెడ్ క్రాస్.. ఈ పేరు వినగానే ప్రాణాపాయస్థితిలో ఉన్నవారికి రక్తదానం చేసే స్వచ్ఛంద కార్యకర్తలు గుర్తుకురావటం సహజం. వరంగల్ కేంద్రంగా సేవలందిస్తున్న యూత్ రెడ్‌క్రాస్‌ సభ్యులు ఇందుకు భిన్నం. వీరంతా రక్తదానానికి పరిమితం కాకుండా సాయానికి మారు పేరుగా నిలుస్తున్నారు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెడుతున్నారు. వరదల వల్ల నష్టపోయిన వారికి మేమున్నాం అంటూ భరోసా కల్పిస్తున్నారు. అవసరమైన నిత్యావసర వస్తువులు అందిస్తున్నారు.

కరోనా ప్రపంచంపై పంజా విసిరి 6నెలలు దాటింది. ఇంకా వైరస్‌ తీవ్రత ఏ మాత్రం తగ్గలేదు. ఆ కారణంగా అందరిలానే అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు వరంగల్ వాసులు . ముఖ్యంగా పేద, మధ్యతరగతి పనుల్లేక అలమటిస్తున్నారు. వీరి కష్టాలను ఇటీవల కురిసిన వర్షాలు మరింత పెంచాయి. భారీవరదలతో ఇళ్లు మునిగిపోయాయి. నిత్యావసరాలూ లభించక అవస్థలు పడ్డారు. అలాంటి వారికి సేవా కార్యక్రమాలతో ఊరట కలిగించారు... యూత్ రెడ్ క్రాస్.

యూత్ రెడ్‌క్రాస్ ద్వారా దేశంలోని వివిధ కళాశాలల్లో చదివే 20 మంది యువతీయువకులు ఒక్కచోటుకి చేరారు. వరద బాధితులకు అండగా నిలిచారు. కరోనా నిబంధనలు పాటిస్తూ... ప్రజలకు జాగ్రత్తలు చెబుతూ సేవా కార్యక్రమాలు చేపట్టారు. వరంగల్‌ ములుగు జిల్లాలో పర్యటించి ... నిత్యావసరాలు, దుస్తులు, దుప్పట్లు అందించారు. సాయం చేసినప్పుడు బాధితులు చూపే అభిమానం చూసి ఎనలేని ఆనందాన్ని సొంతం చేసుకుంటున్నారు.

కరోనా వల్ల కళాశాలలకు సెలవులు కావటంతో ఈ యువ బృంద సభ్యులు...విరామ సమయాన్ని సేవా కార్యక్రమాలకు కేటాయించారు. సొంత డబ్బుతోనే వివిధ సేవా కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేశారు. యూత్ రెడ్ క్రాస్ తరపున వీరు చేస్తున్న సాయం చూసి దాతలు ముందుకొస్తున్నారు. ఆర్థిక భరోసా అందిస్తున్నారు. సమాజానికి ఎంతో కొంత సేవ చేసినప్పుడే అసలైన సంతృప్తి లభిస్తుందంటున్న ఈ యువ బృందం ఏ సమయంలోనైనా, ఎలాంటి ఆపదైనా అండగా నిలుస్తామని హామీ ఇస్తున్నారు.

ఇదీ చదవండి:రెడ్‌క్రాస్‌ వాలంటీర్లు సహాయ చర్యల్లో పాల్గొనాలి: గవర్నర్​

Last Updated : Sep 12, 2020, 9:45 AM IST

ABOUT THE AUTHOR

...view details