దిశ చట్టం చట్టబద్ధం కాలేదని డీజీపీ.. సీఎం, మంత్రులకు అవగాహన కల్పించాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కోరారు. ఈ చట్టం ద్వారా నిందితులకు ఉరిశిక్ష వేశాం అని పగటి కలలుకంటున్న సీఎం, మంత్రులకు డీజీపీ అవగాహన కల్పించాలని హితవు పలికారు.
"డీజీపీ పదవి కోసం గౌతమ్ సవాంగ్ ఇంతగా దిగజారిపోవాలా... స్వప్రయోజనాల కోసం పోలీస్ వ్యవస్థ ప్రతిష్టను తాడేపల్లి ప్యాలెస్‌కు తాకట్టు పెట్టడం ఆయన కెరీర్లో మాయని మచ్చగా మిగిలిపోతుందని లోకేశ్ మండిపడ్డారు. దిశ చట్టాన్ని రాజకీయ లబ్ది కోసం వాడుకున్న జగన్ రెడ్డిని వదిలేసి ప్రతిపక్షాలపై ఏడుస్తారెందుకని ప్రశ్నించారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం ఎంపీడిఓ సరళపై వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దాడి చేసిన ఘటనలో ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నిస్తే మౌనం దాల్చారని ధ్వజమెత్తారు. సీఎం ఇంటి పక్కనే జరిగిన అత్యాచార ఘటనలో నిందితులను పట్టుకున్నారా అని ప్రశ్నిస్తే సమాధానం దాటవేశారన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల కామక్రీడలకు బలైపోయిన మహిళల ఫిర్యాదుపై స్పందించమంటే నీళ్లు నముతున్నారని దుయ్యబట్టారు. గౌతం సవాంగ్ షాడో హోంమంత్రి సజ్జల దగ్గర పనిచేస్తున్న గుమస్తా కాదు, రాష్ట్ర డీజీపీ అని గుర్తుపెట్టుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు". నాడు-నేడు పేరిట డీజీపీ వ్యాఖ్యలకు సంబంధించిన ఓ వీడియోను తన ట్విట్టర్ కు జతచేశారు.