Ramanuja Sahasrabdi Utsav: సమతకు చిహ్నమైన రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాలు పదో రోజు వైభవంగా కొనసాగుతున్నాయి. సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు, సందర్శకులు తరలిరావడంతో శ్రీ రామ నగరం జనసంద్రంగా మారింది. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ సమతామూర్తి సన్నిధిలో ఉన్న 108 దివ్యదేశాల్లో 36 ఆలయాల్లోని దేవతామూర్తులకు ప్రాణ ప్రతిష్ఠాపన చేశారు. యాగశాలలోని పుష్ప మండపంలో వైదిక సంస్కారాలు పూర్తి చేసిన అనంతరం దేవతామూర్తులను దివ్యదేశాలకు తీసుకొచ్చారు. చినజీయర్ స్వామి స్వయంగా దివ్యదేశాల్లో పూజలు నిర్వహించి దేవతామూర్తులను ప్రతిష్ఠించారు. మరో 21 దేవాలయాల్లో దేవతామూర్తుల ప్రతిష్ఠాపనతో మొత్తం 108 దివ్యదేశాల దర్శనానికి అనుమతించనున్నారు. ఈ నెల 13న ఆ 21 దేవాలయాల్లోనూ ప్రతిష్ఠాపన మహోత్సవం జరగనుంది. చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో సామూహిక ఉపనయనాలు, విద్యాప్రాప్తికై హయగ్రీవ ఇష్టి నిర్వహించారు. ప్రవచన మండపంలో శ్రీ లక్ష్మీనారాయణ పూజ, కళాకారుల చేత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
సమతామూర్తి కేంద్రానికి బాబా రాందేవ్..
మరోవైపు రామానుజాచార్యుల విగ్రహ సందర్శన కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అతిథుల రాకతోనూ సమతామూర్తి కేంద్రం మరింత సందడిగా మారింది. అవధూత దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి.. సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించారు. కేంద్రం విశేషాలను చిన జీయర్ స్వామి.. ఆయనకు వివరించారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.. కుటుంబసభ్యులతో కలిసి సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, యోగా గురు బాబా రాందేవ్ ఇవాళ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొననున్నారు. సమతామూర్తితో పాటు దివ్యదేశాలను సందర్శించనున్నారు.