పట్టణ ఓటర్లు వైకాపాకే పట్టం కట్టారు. కార్పొరేషన్లన్నీ ఏకపక్షంగా వైకాపా సొంతం చేసుకుంది. 12 నగరపాలికలకు ఎన్నికలు జరగ్గా... హైకోర్టు ఆదేశాలతో ఏలూరులో లెక్కింపు జరపలేదు. మిగతా 11 చోట్లా వైకాపా విజయదుందుభి మోగించింది. 75 పురపాలికలు, నగర పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా.... తాడిపత్రి, మైదుకూరు మినహాయించి మిగతా అన్ని చోట్లా పీఠం.... అధికార పార్టీనే వరించింది. ఫ్యాన్ జోరుకు 10 చోట్ల ప్రతిపక్షమే లేకుండా పోయింది. పులివెందుల, పుంగనూరు, మాచర్ల, పిడుగురాళ్ల ముందే ఏకగ్రీవమవగా.... రాయచోటి, ఎర్రగుంట్ల, వెంకటగిరి, కనిగిరి, ధర్మవరం, తునిలో అన్ని వార్డుల్నీ వైకాపా కైవసం చేసుకుంది. తాడిపత్రి, మైదుకూరులో మాత్రమే విజయం సాధించిన తెలుగుదేశం.... బొబ్బిలి, నర్సీపట్నం మినహా మిగతా ఎక్కడా పోటీ ఇవ్వలేకపోయింది. గెలిచినవారిని కాపాడుకోగలిగితే.... తాడిపత్రి ఛైర్మన్ పీఠం తెదేపానే గెలుచుకునే అవకాశముంది. మైదుకూరులో వైకాపాకు ఎంపీ,ఎమ్మెల్యేలు కో-ఆప్షన్ సభ్యులున్నారు. అక్కడ తెలుగుదేశానికి జనసేన మద్దతిచ్చి.... గెలిచినవారందరినీ నిలుపుకోగలిగితే..... తెదేపా, వైకాపాలకు సమాన సంఖ్యలో కౌన్సిలర్లు ఉంటారు. అప్పుడు ఛైర్మన్ ఎవరన్నది టాస్ ద్వారా నిర్ణయిస్తారు.
పురపాలక ఎన్నికల్లో వైకాపా దూకుడుకు ప్రతిపక్షాలు కళ్లెం వేయలేకపోయాయి. ఎన్నికలకు ముందే పెద్ద సంఖ్యలో డివిజన్లు, వార్డులను ఏకగ్రీవం చేసుకున్న అధికార పార్టీ.... తాజా ఫలితాల్లోనూ అదే జోరు కొనసాగించింది. స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా... అధికారపార్టీకి కాస్త సానుకూలంగా ఉండటం పరిపాటి. ప్రతిపక్షాలూ గట్టిపోటీనిచ్చేవి. అయితే... ప్రస్తుతం ఆ పరిస్థితీ తారుమారైంది. ప్రతిపక్షాలకు అందనంత ఘనవిజయం... వైకాపా సొంతమైంది. విద్యావంతులే కాక వివిధ సామాజిక, వృత్తి వర్గాలకు చెందినవారు వైకాపా వైపే మొగ్గు చూపారు.
ఈ ఫలితాలతో తెలుగుదేశం శ్రేణులు ఆలోచనలో పడ్డాయి. సార్వత్రిక ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించిన చోట కూడా.... ఈసారి పట్టు నిలుపుకోలేకపోవడంపై ఆ పార్టీ నేతల్లో అంతర్మథనం మొదలైంది. ప్రధానంగా ఆశలు పెట్టుకున్న విజయవాడ, గుంటూరు, విశాఖ పీఠాలనూ దక్కించుకోలేకపోయింది. తిరుపతిలో కేవలం ఒక్క డివిజన్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
జనసేన బోణి కొట్టింది
తొలిసారి పురపోరులో బరిలో దిగిన జనసేన....అక్కడకక్కడ బోణీ చేసింది. భాజపాతో పొత్తు పెట్టుకున్న ఆ పార్టీ..... 1632 వార్డులకుగానూ 320 చోట్ల పోటీ చేసి 18 స్థానాలను దక్కించుకుంది. మొత్తం మీద 10 మున్సిపాలిటీల్లో బోణీ కొట్టింది. ఉభయగోదావరి జిల్లాల్లో ప్రభావం చూపుతుందని అంచనా వేసినా.... అది జరగలేదు. 12 కార్పొరేషన్లలో కలిపి 224 డివిజన్లలో పోటీ చేసిన గ్లాస్ పార్టీ.... 7 స్థానాల్లో గెలుపొందింది. విశాఖలో 3, గుంటూరులో 2, మచిలీపట్నం, ఒంగోలులో తలో డివిజన్ దక్కించుకుంది. ఫలితాల సరళిని పరిశీలించి... తమ పార్టీ ప్రభావంపై అంచనాకొస్తామని ఆ పార్టీ నేతలు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా 12 కార్పొరేషన్లలో 671 డివిజన్లకు నోటిఫికేషన్ విడుదలవగా.... 91 ఏకగ్రీవమయ్యాయి. తిరుపతిలో ఏడో డివిజన్ ఎన్నిక వాయిదా పడగా.... 579 చోట్ల పోలింగ్ నిర్వహించారు. ఏలూరులో లెక్కింపు వాయిదా పడటంతో.... 532 డివిజన్లలో కౌంటింగ్ చేయగా.... వైకాపా 427, ఆ పార్టీ రెబల్స్ 12, తెలుగుదేశం 78, తెదేపా రెబల్స్ 1, జనసేన 7, సీపీఎం 2, సీపీఐ, భాజపా తలొకటి, స్వతంత్ర అభ్యర్థులు 3 డివిజన్లు దక్కించుకున్నారు. 75 మున్సిపాలిటీల్లోని 2వేల 123 వార్డులకు ప్రకటన విడుదలవగా.... 490 ఏకగ్రీవమయ్యాయి. 1632 వార్డులకు ఓటింగ్ నిర్వహించగా.... ఇందులో వైకాపా 1269, ఆ పార్టీ రెబల్స్ 45, తెలుగుదేశం 265, ఆ పార్టీ రెబల్స్ 2, జనసేన 18, భాజపా 7, సీపీఐ 3, కాంగ్రెస్ 1, ఎం.ఐ.ఎం 1, స్వతంత్రులు 21 వార్డులు దక్కించుకున్నారు.
ఫలితాల సరళి
నోటిఫికేషన్ వచ్చినవి 671
ఏకగ్రీవాలు 91
పోలింగ్ జరిగినవి 579
కౌంటింగ్ జరిగినవి 532
డివిజన్లు
వైకాపా 427
వైకాపా రెబల్స్ 12
తెదేపా 78
తెదేపా రెబల్స్ 1
జనసేన 7
సీపీఎం 2