ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"భవనాలకు రంగులు వేసుకోవటానికే వైకాపా పాలన పరిమితం"

గత 5 ఏళ్ల తెలుగుదేశం పాలనలో రూ.40వేల కోట్లతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేశామని పార్టీ అధినేత చంద్రబాబు తెలిపారు. వైకాపా ప్రభుత్వం నరేగా చట్టానికే తూట్లు పొడుస్తుందని ధ్వజమెత్తారు.

చంద్రబాబు

By

Published : Nov 13, 2019, 7:36 AM IST

తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్ ప్రతినిధులతో చంద్రబాబు

తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్ ప్రతినిధులు పార్టీ కార్యాలయంలో తెదేపా అధినేత చంద్రబాబుతో మంగళవారం భేటీ అయ్యారు. తెదేపా హయాంలో జాతీయ ఉపాధి హామీ నిధులను పెద్దఎత్తున ఏపీలో గ్రామీణాభివృద్ది కార్యక్రమాలకు సద్వినియోగం చేశారని ప్రశంసించారు. గత 5 ఏళ్ల కాలంలో నరేగా నిధులు వినియోగించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముందుందని అన్నారు.

తెదేపా హయాంలో నిర్మించిన భవనాలకు వైకాపా రంగులు వేయటం మినహా 5 నెలల పాలనలో ఒక యూనిట్ కాంక్రీట్ పని చేయలేదని ఈ భేటీలో చంద్రబాబు విమర్శించారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాట్లకు చేసిన చిన్న పనులకూ నిధులు చెల్లించలేదని మండిపడ్డారు. పెద్ద కాంట్రాక్టర్లకు మాత్రం వేల కోట్లు చెల్లించారని తప్పుపట్టారు. కేంద్రం ఇచ్చిన నిధులు కూడా విడుదల చేయకుండా, నరేగా చట్టానికే తూట్లు పొడుస్తున్నారని ధ్వజమెత్తారు. గుంటూరు, విజయవాడలో జరిగిన ఏపీ పంచాయతీ రాజ్ ఛాంబర్ ఆందోళనల్లో తెలంగాణ ఛాంబర్ ప్రతినిధులు కూడా పాల్గొనడం పట్ల చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్ ప్రతినిధులు చంద్రబాబును దుశ్శాలువలతో సత్కరించారు.

ABOUT THE AUTHOR

...view details