కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వ్యవసాయ సంబంధిత బిల్లులకు నిరసనగా వైకాపా ఎంపీలు రాజీనామా చేయాలని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రజా వ్యతిరేక బిల్లులకు మద్దతు ఇవ్వడం మానుకోవాలని అన్నారు. వ్యవసాయ బిల్లులు రైతుల ప్రయోజనాలకు భంగం కలిగిస్తాయన్న ఆయన... దీనివల్ల రాష్ట్రంలో వ్యవసాయ రంగం మరింత సంక్షోభంలో చిక్కుకునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
'ఆ బిల్లులకు నిరసనగా వైకాపా ఎంపీలు రాజీనామా చేయాలి' - sailajanath comments on ycp mps news
భాజపా ప్రభుత్వం తీసుకువస్తున్న ప్రజా వ్యతిరేక బిల్లులకు వైకాపా మద్దతు తెలుపుతోందని కాంగ్రెస్ నేత శైలజానాథ్ విమర్శించారు. వ్యవసాయ బిల్లులకు నిరసనగా వైకాపా ఎంపీలు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ బిల్లులతో వ్యవసాయ రంగం మరింత సంక్షోభంలో చిక్కుకునే అవకాశముందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక హెూదా తేలేని వైకాపా ఎంపీలు... ప్రజా వ్యతిరేక బిల్లులకు మాత్రం మద్దతు ఇస్తున్నారు. ఇప్పటికే సీఏఏ బిల్లు, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికల్లో భాజపాకు మద్దతు పలికారు. నేడు వ్యవసాయ బిల్లులకు మద్దతు ఇచ్చారు. ప్రజల ముందు భాజపాను వ్యతిరేకిస్తున్నామని వైకాపా నాటకమాడుతుంది. ఇలా ఎన్నాళ్లు రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు మద్దతు తెలుపుతారు. ఉచిత విద్యుత్ పంపుసెట్లకు మీటర్లు బిగించేందుకు ముందుకు వచ్చింది మన రాష్ట్రం కాదా?. పంజాబ్ లాగానే ఆంధ్రప్రదేశ్ కూడా వ్యవసాయ ప్రధాన రాష్ట్రం. కాబట్టి మన రాష్ట్రం ఎంపీలు ఈ బిల్లులకు నిరసనగా రాజీనామా చేయాలి. - శైలజనాథ్, ఏపీసీసీ అధ్యక్షుడు