కృష్ణా జిల్లాలో...
కృష్ణా జిల్లా వత్సవాయి మండలం తాళ్లూరులో గతేడాది పరిషత్ ఎన్నికల సందర్భంగా చెలరేగి సద్దుమణిగిన ఘర్షణలు..పంచాయతీ ఎన్నికలతో మళ్లీ పురుడుపోసుకున్నాయి. తెలుగుదేశం వర్గీయుల ఇళ్లపై వైకాపా కార్యకర్తలు దాడికి దిగడంతో..ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ వేసిన రోజు తెలుగుదేశం కార్యకర్తలపైనా, ఇళ్లపైనా దాడికి పాల్పడంతో...పోలింగ్ సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలుగుదేశం మద్దతుతో సర్పంచి అభ్యర్థి విజయం సాధించడంతో....గ్రామంలో మళ్లీ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తమకు ఓటు వేయలేదంటూ శెట్టి తిరుపతి కుటుంబసభ్యులపై మరోసారి దాడికి పాల్పడ్డారు. ఏ కొండూరు మండలం గొల్లమందలో వైకాపా వర్గీయుల దాడిలో గాయపడి విజయవాడలో చికిత్సపొందుతున్న వారిని ఎంపీ కేశినేని పరామర్శించారు.
గుంటూరు జిల్లాలో..
గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం కందులవారిపాలెంలో వైకాపా నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ..దళితులు కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తమను గ్రామంలో ఉండకుండా దాడి చేస్తున్నారని తెలిపారు. రక్షణ కల్పించాలంటూ వేడుకున్నారు. సత్తెనపల్లిలో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. సర్పంచ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేశానంటూ వైకాపా నేతలు దాడికి పాల్పడ్డారని కడప జిల్లా రామాపురం స్టేషన్‌లో రమేశ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. హసనాపురం హరిజనవాడకు చెందిన తనపై …. వైకాపా నాయకులు పప్పిరెడ్డి మహేశ్వర్ రెడ్డి, ఆయన వర్గీయులు దాడి చేసి గాయపరిచారంటూ బాధితుడు వాపోయాడు. గ్రామానికి వస్తే చంపేస్తామని బెదిరించడంతో ఊరు వదిలి వచ్చానని ఆవేదన వ్యక్తం చేశారు.
దాడులను తీవ్రంగా ఖండించిన చంద్రబాబు:
తెలుగుదేశం శ్రేణులపై దాడులను చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. తమకు అనుకూలంగా ఓటు వేయలేదని అధికార పార్టీ నేతలు దాడులకు పాల్పడటంపై మండిపడ్డారు. బాధితులకు పార్టీ అండగా ఉంటుందని అభయమిచ్చారు.
ఇదీ చదవండి:'ఎన్నికల్లో వైకాపాకు ఓటువేయలేదని.. దాడులు చేస్తున్నారు'