అయిదేళ్ల పాలనలో 62 ప్రాజెక్టులను తెదేపా ప్రభుత్వం పరిగెత్తిస్తే... వైకాపా ప్రభుత్వం 6 ప్రాజెక్టులకు కూడా సరిగా నిధులు ఖర్చు చేయట్లేదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. తెదేపా హయాంలో 70 శాతం పోలవరం పనులు జరగలేదన్న వైకాపా నేతల విమర్శలను ఆయన తిప్పికొట్టారు. పోలవరం పనులు 69.54శాతం పూర్తయ్యాయని ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిందని గుర్తు చేశారు.
ఏడాదిన్నరగా పోలవరంపై ఎంత ఖర్చు చేశారని మంత్రి అనిల్ని అడిగితే గూగుల్ కొట్టమంటున్నారని మండిపడ్డారు. జలవనరుల శాఖ మంత్రిగా అనిల్ చేయాల్సింది గూగుల్లో వెతకడమా అని నిలదీశారు. వైకాపా సొంత మీడియాలోనూ తెదేపా ప్రభుత్వం వివిధ ప్రాజెక్టులకు ఎంత ఖర్చు పెట్టిందో వాస్తవాలు వెల్లడించారని దేవినేని అన్నారు. ఏడాదిన్నరగా జగన్ సాగునీటి రంగాన్ని భ్రష్టు పట్టించిన అంశాన్ని ఆ కథనంలో ఒప్పుకున్నారని తెలిపారు. మరోవైపు తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవటానికి అమరావతి రైతులు, మహిళలపై అక్రమ కేసులు పెట్టి కక్ష సాధిస్తున్నారని దేవినేని పేర్కొన్నారు.