ఎన్నికల్లో అధికార యంత్రాంగం పాల్గొనకుండా చేస్తూ జగన్మోహన్ రెడ్డి తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారని శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. రాజ్యాంగ సంక్షోభంతో.. రాజకీయ సంక్షోభం సృష్టిస్తున్నందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. గవర్నర్ తనకున్న అధికారాలతో జరుగుతున్న పరిణామాలపై జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పంచాయితీ ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలని బిశ్వభూషణ్‌ను కోరారు.
సుప్రీం కోర్టు ఆదేశాలను పాటిస్తామంటున్న ప్రభుత్వం.. హైకోర్టు తీర్పును గౌరవించాలని హితవు పలికారు. రాజ్యాంగానికి లోబడి పని చేస్తామని చేసిన ప్రమాణాన్ని ఉద్యోగులు, అధికారులు గుర్తు చేసుకోవాలని సూచించారు. ఏ ప్రభుత్వమూ శాశ్వతం కాదని, అధికార యంత్రాగమే శాశ్వతమని వారు గ్రహించాలన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక విధుల్లో పాల్గొననటం దేశ చరిత్రలో లేదని విమర్శించారు. స్థానిక పాలన అందించటంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.