Worst Road Between Gosala to Vanukuru :వైసీపీ ప్రభుత్వ హయాంలో రోడ్లు పరిస్థితి అధ్వానంగా తయారైంది. రోడ్ల మీద వాహనదారులు ప్రయాణించాలంటే వెనకడుగు వేస్తున్నారు. ఎంత జాగ్రత్తగా ప్రయాణించినా ఏం ప్రమాదం జరుగుతుందోనని భయపడుతున్నారు. ముఖ్య పనులు మీద బయటకు వెళ్లాలంటే రెండు మూడు సార్లు ఆలోచిస్తున్నారు. అలా ఉన్నాయి మన రాష్ట్ర రహదారులు. ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తాను అని మాటలు కోటలు దాటేలా మాట్లాడుతారు. నాలుగున్నరేళ్ల పాలన అభివృద్ధి మాత్రం సున్నా.
Bad Roads in AP : రాష్ట్రంలో జాతీయ రహదారుల పరిస్థితి మాత్రమే కాదు గ్రామీణ రోడ్లు పరిస్థితి మరింత అధ్వానంగా ఉన్నాయి. అలాంటి గ్రామం గురించే ఇప్పుడు తెలుసుకుందాం ! కృష్ణా జిల్లా గోసాల నుంచి వణుకూరు వెళ్లే రహదారి అది. ఊరి పేరు తగినట్లే అక్కడికి వెళ్లాలంటే నిజంగా వణకాల్సిందే. ఆ ఊరి రహదారి పొడువు ఏడు కిలోమీటర్లు మాత్రమే. కానీ గుంతలు మాత్రం 700 పైగానే ఉంటాయి. అక్కడ రోడ్లులో గుంతలు కాదు, గుంతల్లో రోడ్లు వెతుక్కోవాలి. పట్టుమని పది అడుగులు వేసేలోపే ఒక గుంత సవాల్ విసురుతుంది. దాన్ని తప్పించుకునేలోపే మరోకటి స్వాగతం పలుకుతుంది. అందుకే ఆ రహదారి దాటడం ప్రయాణికులకు ఓ పజిల్‌ను పూర్తి చేయడం లాంటిదే! నిత్యం వేలమంది రాకపోకలు సాగించే ఆ రోడ్డు ప్రయాణికులకు మాత్రం ప్రాణసంకటంగా మారింది. ఇకా వర్షం కురిస్తే ఆ గోతులన్నీ అడుగుకో మడుగులా మారి ప్రయాణికులు నరకయాతన చూస్తున్నారు.
'రోడ్లపై గుంతలుకాదు, గుంతల్లోనే రోడ్లు' - రహదారుల దుస్థితిపై మండిపడుతున్న వాహనదారులు
People Struggling With Bad Roads : గోసాల నుంచి మద్దూరు వరకూ దాదాపు 7 కిలోమీటర్లు మేర రోడ్డు దుస్థితి ఇదే. గుల్లగుల్లైన ఆ రోడ్డుకు ఆర్టీస్ సర్వీసులు కూడా తగ్గించేశారు. బస్సులు సంఖ్య తగ్గడం వల్ల బడి పిల్లలు ఈ రహదారి నుంచి ప్రయాణించాలంటే అవస్థలు పడుతున్నారు. ఆటోలు మాట్లాడి వెళ్లదాం అనుకుంటే వాళ్లు ముఖం చాటేస్తున్నారు. ఆటోవాలాలు ఈ రోడ్డుకు దండం అంటున్నారు. ఉన్న రోడ్డును బాగు చేయకుండా, ఆర్టీసీ బస్సులు రాక బడికి వెళ్లాలంటే పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పండించిన పంటను మార్కెట్‌కు తరలించేందుకూ రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఆరోగ్యం బాగోలేని వారు ఆసుపత్రులకు వెళ్లాలంటే సగం ప్రాణం దారిలోనే పోయినంత పని అవుతుంది. ఇక ఆపదొస్తే విషమ పరీక్షే.