ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అత్యాశే కొంప ముంచిందా?.. జగన్​తో దూరం జరుగుతున్నారా..? వైఎస్సార్సీపీలో అంతర్మథనం - వైఎస్సార్సీపీ ఓటమి

introspection started in the YSRCP : ఎన్నిక ఏదైనా.. విజయం మాదేనంటూ అతిఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తోన్న వైఎస్సార్సీపీలో ఇప్పుడు అంతర్మథనం మొదలైంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులిచ్చిన షాక్‌ నుంచి తేరుకోకముందే సొంత పార్టీ ఎమ్మెల్యేలూ ఝలక్‌ ఇవ్వడంతో అధినాయకత్వానికి.. తత్వం బోధపడిందనే చర్చ జరుగుతోంది. అత్యాశే కొంప ముంచిందనే వ్యాఖ్యానాలూ వినిపిస్తున్నాయి.

వైఎస్సార్సీపీలో అంతర్మథనం
వైఎస్సార్సీపీలో అంతర్మథనం

By

Published : Mar 24, 2023, 9:02 AM IST

Updated : Mar 24, 2023, 11:06 AM IST

introspection started in the YSRCP : మొన్న పట్టభద్రుల ఎన్నికల్లో ఓటమి.. తాజాాగా ఎమ్మెల్యే కోటాలోనూ అదే ఫలితం పునరావృతం.. ఇదిలా ఉండగా వివేకా హత్య కేసులో... సీఎం సోదరుడు అవినాష్‌రెడ్డి అరెస్టైతే.. పార్టీలో పరిణామాలు మరింత వేగంగా మారతాయని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. భయంతోనో, భక్తితోనో తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పటి వరకు వంగి వంగి దండాలు పెడుతున్నవారే.. రాబోయే రోజుల్లో తామేమిటో అధినేతకు తెలియజేస్తారని విమర్శకులు అంటున్నారు.

అత్యాశే కొంప ముంచిందా.. పంచాయతీలు గెలిచాం స్థానిక సంస్థలు క్లీన్‌స్వీప్‌ చేశాం... కుప్పం పురపాలికనూ కొల్లగొట్టాం ! ఇక కుప్పం అసెంబ్లీ కూడా మాదే.. ఇలా వైఎస్సార్సీపీ నేతలు మొన్నటి వరకూ ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించారు. ముఖ్యమంత్రి ఏకంగా వైనాట్‌ 175 అంటూ పార్టీ శ్రేణులకు హితబోధ చేశారు. అది సాధ్యమా? కాదా? విపక్షాలు ఎద్దేవా చేస్తే చేశారు. కనీసం సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఏమనుకుంటున్నారు? ఈ ప్రశ్నలు వైఎస్సార్సీపీ పెద్దలు తమకు తాము వేసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదనే చర్చ పార్టీ నేతల్లో జరుగుతోంది. అసలు ఈ అత్యాశే కొంప ముంచిందనే వాదన తెరపైకి వస్తోంది.

పూర్తి స్థాయి బలం ఉన్నా..శాసనసభలో వైఎస్సార్ పార్టీకి పూర్తిస్థాయి బలం ఉంది. అలాగే శాసనమండలి పూర్తిగా తమ నియంత్రణలోనే ఉండాలని, అందుకోసం అన్ని ఎమ్మెల్సీ స్థానాలూ సొంతం చేసుకోవాలనే ప్రభుత్వ పెద్దల అత్యాశే ఈ పరాభవాలకు నాంది పలికిందనే చర్చ జరుగుతోంది. ఈ నియంతృత్వ పోకడతోనే గతంలో ఎప్పుడూ పోటీచేయని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేరుగా బరిలోకి దిగి, బొక్కబోర్లా పడ్డామని ఆ పార్టీ ఎమ్మెల్యేలే వ్యాఖ్యానిస్తున్నారు. ఆ పరాభవంతోనైనా గుణపాఠం నేర్చుకోకుండా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు కూడా అన్నీ మాకే కావాలనే ధోరణితో... తగిన సంఖ్యా బలం లేకపోయినా, ప్రత్యర్థి పార్టీ నుంచి వచ్చిన సభ్యులను నమ్ముకుని పోటీ చేశారని చర్చించుకుంటున్నారు.

సీనియర్లపై విశ్వాసమేదీ...పట్టభద్రుల కోటా గానీ, ఎమ్మెల్యే కోటాగానీ .. ఈ రెండు ఎన్నికల విషయంలో పోటీపై అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల సన్నద్ధతపై ఎక్కడా సీనియర్లు, అవగాహన ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలనూ విశ్వాసంలోకి తీసుకోకపోవడం పరాభవాలకు దారి తీసిందనే వాదన వ్యక్తమవుతోంది. వైఎస్సార్సీపీలో అసలు సమష్టి నిర్ణయానికి తావులేదనే ఆవేదనా ఆపార్టీ నేతల్లో వినిపిస్తోంది. ఏ విధాన, ప్రధాన నిర్ణయమైనా పార్టీలో ప్రజాస్వామ్యబద్ధంగా చర్చించి తీసుకోవాలనేది నియమావళి. ఇందుకోసం ప్రత్యేకంగా రాజకీయ వ్యవహారాల కమిటీ లేదా మరో పేరుతోనో ఉన్నతస్థాయి కమిటీ ఉంటుంది. కానీ, వైఎస్సార్సీపీలో ఇలాంటి కమిటీలేవీ లేవు. కీలక నేతలతో చర్చించి నిర్ణయం తీసుకునే సంప్రదాయమూలేదని నేతలు నిట్టూరుస్తున్నారు.

తత్వం బోధపడినట్లేనా..పట్టభద్రుల్లో అన్ని సామాజిక వర్గాలవారు ఉంటారు. వారిలో సంక్షేమ పథకాలు అందుకున్నవారూ ఉంటారు. అయినా, ఓటమిని జీర్ణించుకోలేక.. అసలు వాళ్లు మా ఓటర్లే కాదని, ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించడం, ఆ పార్టీ శ్రేణులను ఇరకాటంలోకి నెట్టిందనే చెప్పాలి. ఈ రెండు ఎన్నికల్లో నాలుగురోజుల వ్యవధిలో దెబ్బమీద దెబ్బ పడిన తర్వాతైనా పార్టీ పెద్దలకు తత్వం బోధపడుతుందనే అభిప్రాయాలు వ్యక్తీకరిస్తున్నారు. జగన్‌ వ్యవహార శైలిపై పార్టీ ప్రజా ప్రతినిధులు, అధిక శాతం నేతలు అసహనంతో ఉన్నారనే విషయం ఎమ్మెల్సీ ఎన్నికలతో తేటతెల్లం అయిందంటున్నారు కొందరు వైఎస్సార్సీపీ నేతలు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పార్టీ నేతలకు జగన్‌ను నేరుగా కలిసే అవకాశం లేకపోవడం, మంత్రులు, ఎమ్మెల్యేలకూ సిఫార్సులతోనే అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం వంటి ధోరణిితో వారు విసిగిపోయినట్లు చెబుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అవసరమయ్యే సరికి పిలిచి మాట్లాడారని, గతంలో నోరువిప్పి సమస్య చెప్పుకుందామంటే అపాయింట్​మెంట్ దొరకడమే కష్టంగా ఉండేదని కొందరు అసంతృప్త ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించడం గమనార్హం.

జగన్ ధోరణి తట్టుకోలేక దూరం జరిగి.. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, రఘురామకృష్ణంరాజు వంటి వాళ్లు జగన్‌ ధోరణిని తట్టుకోలేక దూరం జరిగారని.. బయటకు చెప్పుకోలేని అసంతృప్తులు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బయటికొచ్చారనే చర్చ జరుగుతోంది. బయటకు వెళ్తే ఇబ్బంది పెడతారేమో అనే భయంతో ఇన్నాళ్లూ ఆగారని, ఇకపై పరిస్థితులు అలా ఉండబోదంటున్నారు. వివేకా హత్య కేసులో సీఎం సోదరుడు అవినాష్‌రెడ్డి అరెస్టైతే.. పార్టీలో పరిణామాలు మరింత వేగంగా మారతాయని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. భయంతోనో, భక్తితోనో తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పటి వరకు వంగి వంగి దండాలు పెడుతున్నవారే.. రాబోయే రోజుల్లో తామేమిటో అధినేతకు తెలియజేస్తారని అంటున్నారు.

వైఎస్సార్సీపీలో అంతర్మథనం

ఇవీ చదవండి :

Last Updated : Mar 24, 2023, 11:06 AM IST

ABOUT THE AUTHOR

...view details