chandarababu at nimmakur : ఉభయ తెలుగు రాష్ట్రాలకు ఆయన 'బాబు గారు'.. కానీ నిమ్మకూరు ఆయన్ను 'బావగారూ' అని పిలుస్తుంది. ఇంటి అల్లుడై నాలుగు దశాబ్దాలు దాటినా తాము ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఇప్పటివరకు రాలేదు. ఓ వైపు ఎన్టీఆర్ శత జయంత్యుత్సవాలు, మరోవైపు చంద్రబాబు కృష్ణా జిల్లా పర్యటన... ఈ నేపథ్యాన రాక రాక వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని మధుర జ్ఞాపకంగా మలుచుకున్నారు.. అన్న ఎన్టీఆర్ వారసులు. నందమూరి ఇంటి అల్లుడు నారా చంద్రబాబుకు నిమ్మకూరు ఆత్మీయ ఘన స్వాగతం పలికింది. ఎన్టీఆర్ ఇంటి తరపున.. కుటుంబ సభ్యులు నందమూరి రామకృష్ణ, సుహాసిని.. చంద్రబాబుకు దుస్తులు పెట్టారు.
ఆత్మీయ ఆతిథ్యం... నిమ్మకూరులో ఎన్టీఆర్ పెరిగిన ప్రాంగణం, నందమూరి హరికృష్ణ ఇల్లు, హరికృష్ణ అత్తగారి ఇళ్లను చంద్రబాబు పరిశీలించారు. హరికృష్ణ ఇంట్లో నందమూరి రామకృష్ణ, సుహాసిని, ఇతర కుటుంబ సభ్యులు.. చంద్రబాబుకు ఆతిథ్యం ఇచ్చారు. సంప్రదాయానికి పెద్దపీట వేస్తూ.. ఇంటి అల్లుడుగా నిమ్మకూరు వచ్చిన చంద్రబాబుకు నందమూరి రామకృష్ణ, సుహాసిని దుస్తులు పెట్టారు. ఎన్టీఆర్ చిన్ననాటి విశేషాలను చంద్రబాబు గ్రామస్తుల్ని ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామస్తుల ఆత్మీయ సమ్మేళనంలో చంద్రబాబు పాల్గొన్నారు. పక్కనే ఉన్న పాఠశాలలో వార్షిక పరీక్షలు జరుగుతుండటంతో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా కార్యక్రమాన్ని ఆలస్యంగా ప్రారంభించారు.
నిమ్మకూరు వేదికగా.. మళ్లీ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని బాగు చేస్తాననని నిమ్మకూరు గ్రామస్తుల ఆత్మీయ సమ్మేళనంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. పేదవాడిని ఆర్థికంగా పైకి తీసుకొచ్చేందుకే తన శేష జీవితం అంకితమని ఎన్టీఆర్ పుట్టిన గడ్డపై ప్రమాణం చేసి చెప్తున్నానన్నారు. సంక్షేమ పథకాలు కొనసాగించటతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్నారు. రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీఆర్.. అని చంద్రబాబు కొనియాడారు. సినిమా రంగంలో ఉన్నా సామాజిక బాధ్యతను గుర్తించిన వ్యక్తి అన్నారు. శత జయంతి వేడుకలు మే 28 కల్లా 100 చోట్ల నిర్వహిస్తామని తెలిపారు. చాలా మంది సినిమా హీరోలు వచ్చారు.. వస్తారు... కానీ ఎన్టీఆర్‌ది గొప్ప చరిత్ర అని పేర్కొన్నారు. తెలుగు జాతి కోసం, భాష కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం అని చెప్తూ.. తెలుగు భాష అంతరిస్తే.. జాతి అంతరించి పోతుందని ముందే ఊహించారని గుర్తు చేశారు. నిమ్మకూరు అనే కుగ్రామంలో చాలా సామాన్యమైన జీవితం గడిపిన ఎన్టీఆర్... కృషి, పట్టుదల ఫలితంగా మహోన్నత వ్యక్తిగా, ఆదర్శంగా నిలిచారని, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పి ప్రధానిని నిర్ణయించే స్థాయికి ఎదిగారని కొనియాడారు. ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరి అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టారని, నందమూరి బాలకృష్ణ బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి నడుపుతున్నారని, నారా లోకేష్ ఈ గ్రామాన్ని దత్తత తీసుకుని రోడ్లు, డ్రైనేజీ పనులు చేయించారని తెలిపారు.
పౌర సత్కారం...ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు హాజరయ్యేందుకు నిమ్మకూరు వచ్చిన చంద్రబాబుకు గ్రామం తరఫున సర్పంచ్, వార్డు సభ్యులు పౌర సత్కారం చేశారు.