విజయవాడ నుంచి అవనిగడ్డకు పామర్రు మీదుగా రాకపోకలు సాగించే క్రమంలో కరకట్టపై తరచూ వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. విజయవాడ - అవనిగడ్డ మధ్య సుమారు 85 కిమీ దూరం ఉంది. కరకట్టపైనుంచి కేవలం 60 కిమీ దూరం మాత్రమే ఉండటంతో కృష్ణా ఎడమ కరకట్టపై రెండు లైన్ల దారిని నిర్మించారు.
2012 ఏడాదిలో 137 కోట్ల రూపాయలతో విజయవాడ నుంచి మోపిదేవి వరకు సుమారు 61 కిలోమీటర్ల మేరకు రెండు లైన్ల రహదారిగా విస్తరించారు. ఈ దారిలో ప్రయాణించడం వల్ల సుమారు 25 కిలో మీటర్ల వరకు తగ్గడంతో వాహనాల రద్దీ ఉంటోంది. కరకట్ట పరిసరాల్లో సుమారు 20 గ్రామాల ఉండటం వల్ల 2016 నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులను నడుపుతోంది.
సూచిక ఏది ?
ఆ గ్రామాలు ఉన్నచోట స్పీడ్ బేకర్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. బ్రేకర్‌ను సూచించే బోర్డులు ఏర్పాటు చేయకపోవడం వల్ల అనేక మంది ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రతి పది నిమిషాలకు ఓ బస్సు ఈ కరకట్టపై ప్రయాణిస్తుంటాయి. రెండు సార్లు బస్సులు కరకట్ట కింద పడిపోయిన ఘటనలు ఉన్నాయి.
ఆ వాహనాల వల్లే..
ఈ కరకట్టపై ఇసుక, కంకర తరలించే భారీ వాహనాలు తిరుగుతుండడంతో కరకట్టపై రోడ్డు కుంగిపోయి పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో కరకట్టపై జరిగిన ప్రమాదాల్లో వందలాది జనం ప్రాణాలు కోల్పోయారు. రివర్ కన్సర్వేషన్ అధికారులు కరకట్టకు పుర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టాలని, స్పీడ్ బ్రేకర్ల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని దివిసీమ ప్రజలు కోరుతున్నారు.
ఇవీ చూడండి : పట్టాలెక్కుతున్న జన జీవితం..పుంజుకుంటున్న కార్యకలాపాలు