ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొండపల్లి బొమ్మలు అమ్ముడు పోవటం లేదు ఎందుకు? - Krishna district latest news

రాష్ట్రానికి కళారంగంలో ఖండాంతర ఖ్యాతిని ఆర్జించిపెట్టిన కొండపల్లి బొమ్మలు నేడు చిన్నబోతున్నాయి. కొండపల్లి కొయ్య బొమ్మ మనుగడపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. వచ్చే కొద్దిపాటి ఆదాయాన్ని కరోనా మహమ్మారి లాగేసుకుంది. ఈ క్రమంలో కళాకారుల పరిస్థితి దయనీయంగా మారింది.

kondapalli
kondapalli

By

Published : Dec 5, 2020, 6:42 PM IST

కొండపల్లి బొమ్మలు

కొండపల్లి బొమ్మ ఇంట్లో ఉందంటే అదో రాజసం. ఎవరికైనా బహుమతిగా దానిని ఇచ్చామంటే అదో అపురూపం. తెలుగునాట ఇది లేని బొమ్మల కొలువులు ఉండవు. పురాణాలు, ఇతిహాసాలే కాదు, మన చరిత్రను, సంస్కృతి సంప్రదాయాలను కొండపల్లి బొమ్మల రూపంలో చెప్పవచ్చు. అంతటి ఘనమైన ఖ్యాతి కొండపల్లి బొమ్మల సొంతం. ప్రధాని మోదీ సైతం ఇటీవల కొండపల్లి బొమ్మల అందాలను మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించారు. ఈ అందమైన బొమ్మల వెనుక ఒక చిన్నపాటి యుద్ధమే ఉందని చెప్పాలి. బొమ్మల తయారీకి కావాల్సిన చెక్కను సేకరించడం దగ్గర నుంచి వాటిని అద్భుతంగా చెక్కడం, ఆకర్షణీయమైన రంగులు వేయడం వరకు కళాకారుల కష్టం మాటల్లో చెప్పలేనిది.

కొండపల్లి బొమ్మలు

కొంపముంచిన కరోనా

కొండపల్లి బొమ్మ అమ్మకాలపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. గతతంలో కొండపల్లి నుంచి హైదరాబాద్‌, విశాఖ, దిల్లీ, ముంబయిలకు ఈ బొమ్మలు ఎగుమతి అయ్యేవి. కరోనా రాకతో ఎగుమతులు ఆగిపోయాయి. కళాకారులందరూ తయారు చేసిన బొమ్మల నిల్వలు పేరుకుపోయి ఉన్నాయి. దీనివల్ల కళాకారులూ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. గతేడాది కోటి రూపాయల వరకూ అమ్మకాలు జరిపితే.. ఈ ఏడాది 9 నెలల కాలానికి కేవలం 15 లక్షల రూపాయల అమ్మకాలు మాత్రమే జరిగాయి. మరోవైపు పర్యాటకులు రాకపోవటంతో కొండపల్లిలో బొమ్మలు విక్రయ దుకాణాలకే పరిమితమయ్యాయి.

కొండపల్లి బొమ్మలు

కళాకారులు ఏం కోరుకుంటున్నారు?

  • కొండపల్లి బొమ్మలు బహుకరించే ఆలోచనను ప్రజల్లో అధికారులు తీసుకురావాలి
  • కొండపల్లి బొమ్మలకు సరైన మార్కెట్ కల్పించాలి
  • మాకు రోజుకి 300- 500 రూపాయల వరకు ఆదాయం వచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి
కొండపల్లి బొమ్మలు

కలప కష్టాలు

కృష్ణా జిల్లా కొండపల్లిలో ఆరు శతాబ్దాల క్రితమే బొమ్మల తయారీ ప్రారంభమైనట్లు చరిత్ర చెబుతోంది. 15వ శతాబ్దం నాటి విజయనగర, చంద్రగిరి శాసనాల్లో కొండపల్లి బొమ్మల ప్రస్తావన ఉంది. తెల్ల పొనిక, నల్ల పొనిక చెట్ల నుంచి తీసిన కలపను బొమ్మల తయారీకి వినియోగిస్తుంటారు. కొండపల్లితో పాటు సమీపంలో జి.కొండూరు, గంగినేని అటవీ ప్రాంతాల్లో మాత్రమే ఈ చెట్లు కనిపిస్తాయి. గతంలో కళాకారులే అడవుల్లోకి వెళ్లి బొమ్మల తయారీకి అవసరమైన కలపను తీసుకువచ్చేవారు. తర్వాతి కాలంలో కొందరు కూలీలు ఈ కలపను తీసుకువచ్చి కళాకారులకు విక్రయించటం ప్రారంభమైంది. అయితే ఇటీవలి కాలంలో కలప కొరత కూడా తీవ్రమైంది. శతాబ్దాల నుంచి తెల్లపొనిక చెట్లను నరికేయటంతో ఈ వృక్షసంపద చాలావరకు తరిగిపోయింది. ఇపుడు అడవి లోపలకు వెళ్లి చెట్లను తీసుకువస్తున్నారు.

కొండపల్లి బొమ్మలు

చొరవ చూపాలి

ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కళాకారులకు ప్రత్యేక కాలనీ ఏర్పాటు చేసి ఇళ్లు నిర్మించారు. కొత్తతరం ఈ రంగంలో ఎక్కువకాలం ఉండటం లేదు. పని నేర్చుకుని మళ్లీ వేరే వృత్తుల వైపు వెళ్లిపోతున్నారు. మరికొందరు అరకొర పనితోనే పెద్ద వ్యాపారుల వద్ద కూలీ పని చేస్తున్నారు. తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపి ఆదుకోవాలని కళాకారులు వేడుకుంటున్నారు.

కొండపల్లి బొమ్మలు

ఇదీ చదవండి

'మేటి కొప్పాక'.. మనసు దోచే కొండపల్లి బొమ్మల వైభవం

ABOUT THE AUTHOR

...view details