రాష్ట్రంలో రెండో పెద్ద పోలీసు కమిషనరేట్ విజయవాడ. ప్రస్తుత నగర సీపీ బత్తిన శ్రీనివాసులు.. నవంబరు నెలాఖరున పదవీ విరమణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త సీపీ ఎవరన్న దానిపై సర్వత్రా చర్చ నడుస్తోంది. ఎవరిని నియమించాలన్న దానిపై పెద్ద ఎత్తున కసరత్తు సాగుతోందని సమాచారం. ప్రస్తుతం కమిషనర్ ఐజీ స్థాయి అధికారి. ప్రభుత్వం ఈ స్థాయిని అలాగే ఉంచుతుందా? లేక డీఐజీకి కుదిస్తుందా? గత ప్రభుత్వ హయాంలో వలె ఏడీజీ స్థాయి అధికారిని నియమిస్తుందా? అన్నది తేలాల్సి ఉంది.
పెరిగిన ప్రాధాన్యత..
గతంలో బెజవాడ కమిషనర్‌గా డీఐజీని నియమించే వారు. తెదేపా హయాంలో అమరావతిని రాజధానిగా నిర్ణయించిన తర్వాత ప్రాధాన్యత మారింది. అప్పట్లో ఏడీజీగా ఉన్న గౌతం సవాంగ్‌ను నియమించింది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పలు ప్రాంతాలను కలిపి అమరావతి కమిషనరేట్‌గా మార్చాలని గతంలో నిర్ణయించారు. దీని కోసం కసరత్తు కూడా చేశారు. ఈ ఉద్దేశంతోనే సవాంగ్ అనంతరం కూడా ద్వారకా తిరుమలరావును నియమించారు. గత ఏడాది ఆయన బదిలీ అనంతరం ఐజీ స్థాయికి కుదించి, అదనపు కమిషనర్‌గా ఉన్న శ్రీనివాసులును సీపీగా నియమించారు. ప్రస్తుతం అమరావతి పోలీసు కమిషనరేట్ ప్రతిపాదన అటకెక్కటంతో ప్రస్తుత స్థాయినే కొనసాగించవచ్చన్న వాదన కూడా ఉంది.