ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఖరీఫ్‌ సాగుకు పొలాలు సిద్ధం.. పట్టిసీమ నీరెప్పుడో? - పట్టిసీమకు నీరు వదలకపోవడంతో రైతుల ఆందోళన

మరి కొద్ది రోజుల్లో జాన్‌ నెల ప్రారంభం అవుతున్నా ప్రభుత్వం పట్టిసీమ నీరు వదలక పోవడంతో పోలవరం కాలువ మీద ఆధారపడి ఖరీఫ్‌లో సాగుచేసే రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మే మొదటి వారం అడపా దడపా జల్లులు పడుతూ ఉండడంతో కృష్ణా జిల్లాలోని మైలవరం, గన్నవరం, నూజివీడు, తదితర నియోజకవర్గాల రైతులు ఖరీఫ్‌ సాగుకు ఇప్పటికే పొలాలను సిద్ధం చేసుకున్నారు.

పట్టిసీమ నీరెప్పుడో
పట్టిసీమ నీరెప్పుడో

By

Published : May 18, 2021, 7:28 PM IST

పట్టిసీమపై ఆధారపడి ఏటా కృష్ణా జిల్లాలో 9,861 హెక్టార్లలో నారుమళ్లు వేస్తారు. మే నెల ముగుస్తున్నా కాలువలకు నీరు రాకపోవడంతో నారుమడులు వేస్తే సాగునీటి పరిస్థితి ఏంటని కలవరపడుతున్నారు. మరోవైపు నియోజకవర్గాల్లోని ఊర చెరువులు కూడా మండుటెండలకు నీటిమట్టం తగ్గి పూర్తిగా ఖాళీ అయ్యాయి. దీంతో ఖరీఫ్‌ సాగుకు నారుమడులు వేస్తే పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొని వర్షాలు పడితేనే నీళ్లు అన్నట్లు పరిస్థితి తయారవుతుందని అన్నదాత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పోలవరం కాలువకు నీరు విడుదల విషయాన్ని ఇప్పటికే గన్నవరం, ఆగిరిపల్లి, నూజివీడు, మైలవరం, విజయవాడ రూరల్‌ మండల రైతులు స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. పట్టిసీమకు నీరు విడుదల సమస్య పరిష్కారంపై అధికారులు, ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన వెలువడకపోవడంతో అన్నదాతల్లో ఆందోళన మరింత ఎక్కువైంది.

జిల్లాలో అత్యధికంగా 2.35 లక్షల హెక్టార్లలో వరి సాగు చేయాల్సి ఉండగా నీటి లభ్యత అరకొరగా ఉండటం.. మరోపక్క కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో జులై చివరి నాటికి గతేడాది 1.,07 లక్షల హెక్టార్లలో మాత్రమే పంట సాగుచేస్తున్నారు. పట్టిసీమ నీరు ఆలస్యమైతే ఈ ఏడాది ఖరీఫ్‌లో వరి సాగు శాతం మరింత తక్కువయ్యే ప్రమాదం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సత్వరమే పట్టిసీమకు నీటిని విడుదల చేసి ఆదుకోవాలని జిల్లా రైతు సంఘం నాయకులు, కర్షకులు కోరుతున్నారు.

ఇదీ చూడండి.. 'వైఎస్సార్‌ మత్స్యకార భరోసా' నిధుల విడుదల

ABOUT THE AUTHOR

...view details